(Source: ECI/ABP News/ABP Majha)
Karimnagar News : మంచినీటి పైపులు, మురుగునీటి పైపులు ఒకే చోటా?
కరీంనగర్ లో మురుగునీరు, తాగు నీటి పైపు లైన్లు ఒకే చోట వేస్తుండటం ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అయితే స్థలం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్ లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్తగా తాగు నీటి పైపు లైన్లు వేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేస్తుండగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ప్రశ్నార్ధకంగా తయారు అవుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా తాగు నీటి పైపు లైన్లు వేసేందుకు చర్యలు చేపట్టారు. సిమెంట్ పైపులు ఉన్న చోట కచ్చితంగా మారుస్తున్నారు. నగర వ్యాప్తంగా హెచ్డీపీఈ పైప్ లైన్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల లీకేజీలను తగ్గించాలని నిర్ణయించారు. ఇక్కడి వరకు ప్లాన్ అంతా బాగానే ఉండగా గతంలో మాదిరిగానే పైప్ లైన్ వేయడం సమస్యలకు కారణంగా మారుతోంది.
మురుగు, తాగునీటి పైపులు ఒకేచోట..
ఐదు సంవత్సరాల కిందట ప్రధాన రహదారులకు ఇరు వైపులా పైపు లైన్ ఇలాగే వేయగా ప్రస్తుతం స్మార్ట్ సిటీ లో కూడా అదే విధానం అమలు చేస్తున్నారు. నగరంలో పాత పైప్ లైన్లు ఒకదానికి ప్రక్కనే మరోటి ఉండగా కొత్తగా వేసిన పైప్ లైన్ లో కూడా ఒకే కందకంలో ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్డు మధ్యలో ఉండగా, మరి కొన్ని వీధుల్లో మురుగు నీటి కాలువలకు ఆనుకొని మరి కొన్ని ఉన్నాయి. ఈ పనులు చేసే సమయంలో రూల్స్ ప్రకారం ఏ విధంగా వీటిని వేయాలి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలో స్థలం లేకపోవడంతో ఈ సమస్య వస్తుందని చెబుతుండగా ప్రధాన రహదారులపై పైపులు వేసి మట్టిని కప్పేస్తున్నారు.
పనులు చేసే సమయంలో కష్టాలు..
రెండు పైపులైన్లు ఒకటే చోట వేస్తే కొత్త సమస్యలు మొదలు అవుతాయి. భవిష్యత్తులో లీకేజీలు అయితే తవ్వడానికి ఎన్నో అవస్థలు పడాల్సిందే.. చిన్న పైప్ లైన్ లో కాకుండా మెయిన్ పైపులు కూడా ఇలాగే ఉంటున్నాయి. ఇటీవల మారుతి నగర్ చౌరస్తా నుండి పాత బజార్ కి వచ్చే దారిలో రెండు పైప్ లైన్ లో ఒక దానిపై ఒకటి ఉండగా అంబేద్కర్ నగర్ ప్రధాన పైప్ లైన్ ఆర్ అండ్ బీ చౌరస్తాలో ఇలాగే ఉండడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక లీకేజీ చేస్తే మరో పైప్ లైన్ ఎక్కడ పగులుతుందో అనే భయంతో పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొన్ని సందర్భాల్లో లీకేజీల మరమ్మతులు చేస్తే నీటి సరఫరాకు రెండు రోజుల వరకు అంతరాయం కలుగుతుంది.
లీకేజీల సమయంలో ఇబ్బందులు..
నగరంలో మురుగునీటి కాలువల్లోనే తాగు నీటి పైపు లైన్లు ఉంటున్నాయి. అలాగే కొత్తగా పైప్ లైన్ వేసే సమయంలో వీటిని మార్చాల్సి ఉండగా, అలాగే వేసుకుంటూ వెళ్తున్నారు. ఆటంకాలు ఏర్పడి నీరంతా రోడ్ల మీదికి వస్తుంది. లీకేజీలు అయితే మురుగు నీరు, మంచి నీరు రెండూ కలిసి పోయి కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది. గాంధీ రోడ్డు, సుభాష్ నగర్, అశోక్ నగర్ శ్రీనగర్ కాలనీ, సప్తగిరి కాలనీ, గోదాం గడ్డ, కోతిరాంపూర్ కమాన్, పాత బజార్, తదితర ప్రాంతాల్లో ఇలాగే ఉండగా వాటిని అలాగే వదిలేశారు. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డ్ రిజర్వాయర్ లో పరిధిలో లీకేజీ మరమ్మతు చేసేందుకు తగ్గడంతో రెండు పైపు లైన్లు ఒకదానికి ఒకటి ఉండడంతో కార్మికులు పరిశీలించారు. శాస్త్రి రోడ్ లో ఇటీవల స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో తాగు నీటి పైపు లైన్లు రెండింటి మధ్య కనీసం మూడు ఫీట్ల దూరం కూడా లేకుండా పోయింది. మారుతి నగర్ నుంచి పాత బజార్ కు వచ్చే దారిలో పైపు లైన్లు లీక్ అవుతూ ఉండడంతో మరమ్మతులు చేసేందుకు కార్మికులు ఇబ్బందులు పడ్డారు.