Minister Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్ కు గాయాలు, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కూలిన సభావేదిక!
Minister Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్ కు ప్రమాదం తప్పింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఉన్న స్టేజ్ కూలింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్పగాయాలు అయ్యాయి.
Minister Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత్రి హాజరయ్యారు. అయితే మంత్రి గంగుల, ఇతర నేతలు కూర్చొన్న సభ వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మంత్రి సహా బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్ప గాయాలు కావడంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తనకు చిన్న గాయమే అయిందని మంత్రి తెలిపారు. ఈ ఘటనలో జెడ్పీటీసీకి కాలు విరిగినట్లు తెలుస్తోంది. వేదికపైకి పెద్ద సంఖ్యలో జనం ఎక్కడంతో స్టేజ్ కూలినట్టు స్థానికులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి గంగుల
అంతకు ముందు కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూర్, ముగ్ధుంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో యాసంగి పంట ముందుగానే కోతకు వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో 15 రోజులు ముందే ధాన్యం కొనుగోలును ప్రారంభించామన్నారు. పంటను కొనుగోలు చేయాలని ఎఫ్.సి.ఐను రిక్వెస్ట్ చేశామన్నారు. గత సంవత్సరం కూడా యాసంగి పంట కొనుగోలును ఇదే రోజు ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను... దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 7100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనాకు ముందు తెలంగాణలో కేవలం 3 వేల కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండేవన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
420 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
"ఒక్కో గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైన చోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచుతాం. తెలంగాణలో శనివారం వరకు మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. శనివారం వరకు 4 కోట్ల 15 లక్షల విలువచేసే రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ప్రతిరోజు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు అందుబాటులో ఉంది. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. రైతులు నిబంధన మేరకు తమ పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. ధాన్యంలో నూక శాతం పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మాది రైతు ప్రభుత్వం... రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పంట కోతకు వచ్చే సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మాపై ఉంది. ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాం. ఒక్కొక్క బస్తాపై నలభై కిలోల 650 గ్రాములే. రైతు పండించిన పంటకు మద్దతు ధర చెల్లిస్తాం" -మంత్రి గంగుల
భూమికి బరువైన పంటలు
దేశంలో యాసంగి వర్షాకాలం రెండు పంటలు పండిస్తారని మంత్రి గంగుల తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా యాసంగి పంటను కొనుగోలు చేస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్ దే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యాసంగి పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. నాటి కాలంలో దేవుళ్లు యజ్ఞాలు చేస్తే రాక్షసులు రక్తాన్ని పోసేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల యజ్ఞం చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్రలనే రక్తాన్ని పోస్తున్నారని విమర్శించారు. ఇక్కడి కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమైక్య పాలనలో సాగునీరు లేక సగం భూమి బీడు పెట్టిన రోజులు ఉండేవన్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మండు ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుకుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. రైతుకు చిన్న ఇబ్బంది కలిగిన సీఎం కేసీఆర్ తట్టుకోలేరన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలన్నారు.