Viral News: వ్యక్తిగత జీవితంపై అసంతృప్తితో ప్రొఫెసర్ అదృశ్యం - హమాలీ పనులు చేసుకుంటూ జీవనం!
Viral News: వ్యక్తిగత జీవితంపై అసంతృప్తితో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదృశ్యం అయ్యాడు. హమాలీగా పనులు చేసుకుంటూ పది రోజులుగా జీవనం సాగిస్తున్నాడు.
Viral News: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న యువకుడు.. వ్యక్తిగత జీవితంపై అసంతృప్తితో అదృశ్యం అయ్యాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసిన అతడే హమాలీ పనులు చేశాడు. చివరకి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అసలేం జరిగిందంటే..?
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు అబ్దుల్లాపూర్ మెట్ ఠాణా పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ హాస్టల్ లో ఉంటున్నాడు. ఈనెల 7వ తేదీన హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తమ కుమారుడికి ఏమైపోయిందో అనుకున్న కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. తెలిసిన వాళ్లు, స్నేహితులు, బంధువులందరికీ ఫోన్లు చేసి అడిగారు. ఎక్కడికీ రాలేదని చెప్పడంతో ఈనెల 17వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్ స్పెక్టర్ స్వామి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎస్ఐ సునీల్ కుమార్ బృందం యువకుడి కుటుంబ సభ్యులు, హాస్టల్ లోని విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.
గతంలోని అతడు ఇంటి నుంచి వెళ్లి కూలీ పనులు చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మండలంలోని పండ్ల మార్కెట్ ప్రాంతంలో యువకుడు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. మంగళవారం తెల్లవారుజామున మార్కెట్ కు పనుల కోసం వచ్చే వారిపై నిఘా పెట్టారు. ఊహించినట్లే అతడు మార్కెట్ లో హమాలీ పనుల కోసం వచ్చాడు. అక్కడ పని చేస్తుండడం గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 24 గంటల్లోనే తమ కుమారుడిని తమకు అప్పగించిన పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
నెలరోజుల క్రితం ముగ్గురు బాలికల అదృశ్యం
హైదరాబాద్ లోని తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు అదృశ్యం అయ్యారు. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపుతోంది. పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు్నారు. త్వరగా తమ పిల్లలను వెతికి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు.
హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మరియా అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న స్నేహితులు హసీనా, సక్నతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురూ కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న ఉదయం వెళ్లిన బాలికలు నేటికీ ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు వెతుకులాటలు మొదలు పెట్టారు. ఫోన్లు చేస్తుంటే ముగ్గురి ఫోన్ లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఎలాంటి ఆచూకీ లబించకపోవడంతో ఆందోళన ఎక్కువైంది. రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.