Gas Cylinder For RS 500 : రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక అప్‌డేట్- కంగారు పడొద్దని చెబుతున్న అధికారులు
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రెండు హామీలు నెరవేరినా మిగతా వాటిలో ముఖ్యమైన వాటిపై ప్రజల దృష్టి ఉంది. అందులో ఒకటి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రెండోది 2500 రూపాయలు.
Mahalaxmi Schemes: తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడానికి ఆరు హామీలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఎన్నికల సందర్భంగా చాలా హామీలు ఇచ్చినప్పటికీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది మాత్రం ఆరు గ్యారంటీలే. అందుకే వాటి అమలు కోసం ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం కొలువు దీరిన తొలిరోజే మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పథకం పరిధిని పది లక్షలకు పెంచింది. ఇప్పుడు మిగతా హామీలపై కూడా దృష్టి పెట్టింది.
ఆ రెండు పథకాలపై ప్రజలు ఆసక్తి
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో రెండు హామీలు నెరవేరినా మిగతా వాటిలో ముఖ్యమైన వాటిపై ప్రజల దృష్టి ఉంది. అందులో ఒకటి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రెండోది 2500 రూపాయలు. వీటిలో అందరి దృష్టి గ్యాస్ సిలిండర్ పథకంపై ఉంది. అందుకే ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఎవరు ఏం చెప్పినా పరుగులు పెడుతున్నారు.
ఈకేవైసీ కోసం జనం పాట్లు
ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా ఈకేవైసీ అప్‌డేట్‌పై పుకార్లు వచ్చాయి. ఎక్కడ వెనకబడిపోతామో అని జనాలు పరుగులు పెట్టారు. ఒకర్ని చూసి ఒకరు ఇలా అంతా మూకుమ్మడిగా గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్‌లపై పడ్డారు. దీంతో జనాలతో అవి నిండిపోయాయి. పనులు వదులుకొని ఉదయం 8 గంటల నుంచి పొద్దుపోయేవరకు కూడా అక్కడే ఉంటున్నారు.
అధికారిక ప్రకటన రాలేదంటున్న అధికారులు
జనాలను అదుపు చేసేందుకు ఈకైవైసీ కోసం ఆఫీస్‌లకు రానవసరం లేదని ఇంటి వద్దకే గ్యాస్ డెలవరీ బాయిస్ వచ్చి అప్‌డేట్ చేస్తారని చెప్పారు. అయినా జనాలు ఆగడం లేదు. ఈ విషయం కాస్త అధికారుల వద్దకు వెళ్లింది. అసలు తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రాలేదని, ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేది చెబుతున్నారు.