TS High Court: అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలి రోజు సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు గందరగోళం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురైన వ్యవహారంలో రిజిస్ట్రార్‌కు హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము సస్పెన్షన్‌కు గురి కావడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు నోటీసులు తీసుకోవడం లేదని వారు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. నోటీసులు అందేలా చూడాలని కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. అసెంబ్లీకి వెళ్ళే ముందు ఫోన్‌లో ముందే సమాచారం ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు సూచించింది.
బడ్జెట్ సమావేశాల తొలి రోజే సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలి రోజు సందర్భంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు గందరగోళం చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా వారు ముగ్గురూ వెల్‌లోకి వెళ్లి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఈటల రాజేందర్, రఘనందన్‌రావు, రాజా సింగ్‌లపై సస్పెన్షన్ ఉంటుందని స్పీకర్ తేల్చ చెప్పారు.
హైకోర్టుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
అధికార పార్టీ తీరును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సభా నియమాలకు వారు విరుద్ధంగా వ్యవహరించారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సింగిల్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. సస్పెన్షన్ తీరు రాజ్యాంగానికి, శాసన సభ నియమావళికి విరుద్ధంగా ఉందని వారు చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సూచించగా.. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ, ధర్మాసనం జారీ చేసిన నోటీసులను అనేక ప్రయత్నాలు చేసినా అసెంబ్లీ కార్యదర్శికి అందజేయలేకపోయామని హైకోర్టు రిజిస్ట్రీ తెలిపారు. కనీసం సస్పెన్షన్ ఉత్తర్వులు, వీడియో రికార్డులు ఇవ్వడం లేదని అన్నారు. దీంతో హైకోర్టు ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.