Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: ఆరెస్సెస్ భావజాలంతో బీజేపీ పనిచేస్తోందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు లేని దేశంగా భారత్ ను మార్చడమే బీజేపీ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Telangana CM Revanth Reddy About Reservations- హైదరాబాద్: దేశంలో నలుమూలలా పర్యటిస్తూ రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ (Congress Party) ఉద్దేశమని స్పష్టం చేశారు. రాజకీయ పరమైన, ఉద్యోగ నియామకాలు, విద్య ఇలా మూడు రకాలుగా రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉందన్నారు. విద్య, ఉద్యోగాలలో కాకుండా చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.
1978లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసి జనాభా, కులాలను అంచనా వేసిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని వీపీ సింగ్ తీసుకున్నారని గుర్తుచేశారు. 27 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాడు ఆరెస్సెస్ వర్గాలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, ఉన్నత వర్గాలకు మద్దతుగా పోరాటం చేశాయన్నారు. చివరికి సుప్రీంకోర్టు ఎస్సీలకు 17, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తూ, వర్టికల్ గా 50 శాతం మించకూడదని తీర్పునిచ్చింది. చట్ట సభల్లో తమకు రిజర్వేషన్ కావాలని ఓబీసీలు పలు మార్లు ప్రస్తావించాయని చెప్పారు.
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా.. జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ, ఓబీసీ ప్రతినిధులు కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉంటే అక్కడ వారికి న్యాయం చేస్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. కానీ మోదీ, అమిత్ షాలకు అదానీ, అంబానీ తోడయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కో ప్రాంతాన్ని తమ పరిధిలోకి తెచ్చుకున్నాయని చెప్పారు. ఆరెస్సెస్, బీజేపీతో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు కావాలి. అందుకే 400 సీట్లు కావాలని మోదీ, అమిత్ షా చెప్పడం వెనుక రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ప్రధాన అజెండా అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ విధానాలను రాహుల్ గాంధీ, తాము అడ్డుకుంటున్నామన్న కోపంతో హిందువుల ఆస్తులను గుంజుకుంటారని, రెండు ఇండ్లు ఉంటే ఒకటి లాక్కుంటారని, మహిళల మెడలో తాళిబోట్లు తెంపేస్తారని బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం.. భార్య ఆస్తి వాడుకుంటే భర్త తిరిగి ఆమెకు ఆ మొత్తం ఇవ్వాల్సిందేనన్నారు.
400 సీట్లు వస్తే రిజర్వేషన్లు లేని దేశంగా భారత్
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని, 400 సీట్లు వస్తే తద్వారా రిజర్వేషన్లు లేని దేశంగా భారత్ ను చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ, దళితులలో ఉప కులాలు వస్తే.. వీరందర్నీ ఒకే సమాజంగా చూపించేందుకు ఇబ్బందిగా ఉందని రిజర్వేషన్లు రద్దుకు పావులు కదుపుతున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, ఓబీసీలను ఈస్ట్ ఇండియా కంపెనీల ముందు గతంలో నిల్చోబెట్టినట్లు, అదానీ, అంబానీల ముందు వాళ్లను మళ్లీ చేతులు కట్టుకుని నిల్చోబెట్టాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయడం లేదని మోదీ, అమిత్ షా ఎక్కడా చెప్పడం లేదని ప్రజలు గుర్తించాలన్నారు.