CM KCR: అల్పాహారం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఎన్నికల కోడ్ వచ్చేలోపే అమలుకు ప్రణాళిక
CM KCR: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
CM KCR: ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దసరా నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని (సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం) ప్రారంభించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు మరింత ముందుగానే ఈ స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉండటంతో.. అంతకు ముందుగానే సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం ను అమలు చేయనుంది. ఈ నెల 4వ తేదీ నుంచే ప్రారంభించాలని మొదట అనుకున్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెద్ద మొత్తంలో గౌరవ వేతనం, బిల్లులు పెండింగ్ లో ఉన్నందు వల్ల, ఆ చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అల్పాహార పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. అదే రోజు ఆయా జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించేలా సన్నాహాలు మొదలు పెట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పదో తరగతి తరగతుల విద్యార్థులకు ఉదయం సమయంలో అల్పాహారం అందించనున్నారు. ఈ పథకాన్ని అక్టోబర్ 24వ తేదీన లాంఛనంగా ప్రారంభించాలని మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ పథకం అమలు చేయడానికి గానూ ఒక విద్యా సంవత్సరానికి దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పాహార పథకాన్ని ముందస్తుగా ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ఉన్నందు వల్ల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 6 రోజుల పాటు జిల్లాకు ఒక పాఠశాలలో అమలు చేయాలని అధికారులకు నిర్దేశించారు.
అల్పాహార పథకాన్ని అమలు చేయడానికి మన ఊరు - మన బడి కార్యక్రమం కింద పనులు పూర్తి అయిన పాఠశాలలను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయగల ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలనే మొదటగా ఎంచుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్ర సంస్థ ద్వారా అమలు అవుతోంది. అక్కడ ఆ సంస్థకే అల్పాహారం అందించే బాధ్యత ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 26వ తేదీన మళ్లీ బడులు మొదలు కానున్నాయి. అప్పటి నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేస్తారా.. లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అల్పాహారంలో ఏయే పదార్థాలు అందించాలి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో.. మెనూ విషయంపై అడగ్గా.. మెనూ గురించి తర్వాత చెబుతామంటూ ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే మెనూపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.