నేడు తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం: ఎన్నికలు, రిజర్వేషన్లపై బిగ్ డిసిషన్?
Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ (గురువారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధత వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ - బీసీ రిజర్వేషన్ల అమలు
ఈ క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే, పంచాయతీ రాజ్ చట్టం 2018ని ప్రభుత్వం సవరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ఇటీవలే పంచాయతీ రాజ్- 2025 చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ద్వారా రేవంత్ సర్కార్ ఆమోదింపజేసింది. ఇందులో 23.81 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ చట్టాన్ని సవరించారు. అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటుతుండటంతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపడం జరిగింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితేనే తప్ప 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యం కాదు. ఇటీవలే ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించి ఆ వివరాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ల అమలు ఎలా, స్థానిక సంస్థలను ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశాలపైనే ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గం చర్చ చేయనుంది.
వర్షాకాల సన్నద్ధతపై చర్చ
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపైన ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగవచ్చు. వరద ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేయడం, అవసరమైన సహాయక చర్యల ప్రణాళికలు, విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్, సహాయక బృందాల సన్నద్ధత వంటి అంశాలపైన మంత్రివర్గం చర్చ చేయనుంది.
రైతుల ఖరీఫ్ సీజన్ సన్నద్ధత
వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వ్యవసాయ ప్రణాళికలపై రాష్ట్ర క్యాబినెట్ చర్చించనుంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, వాటిని సక్రమంగా పంపిణీ చేసే ప్రణాళికలపైన చర్చించనున్నారు. రుణమాఫీ అమలు, కొత్త రుణాల మంజూరు వంటి అంశాలపైన మంత్రివర్గం ఈ సమావేశంలో దృష్టి పెట్టనుంది. రైతులు ఎదుర్కొనే సమస్యలు, ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన పరిష్కారాలు, తక్షణ ఉపశమన చర్యలపై క్యాబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చ
మేడిగడ్డ బ్యారేజి నుంచి నీటి విడుదల పరిస్థితిని, ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు, రైతుల డిమాండ్‌పైన చర్చించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో రైతులకు సాగునీటి లభ్యత వంటి అంశాలపై ఎక్కువ చర్చ జరగవచ్చు. అదే రీతిలో కాళేశ్వరం కమిషన్ నివేదిక, సిఫారసులు, ఈ అంశంపై రాజకీయంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోవాలన్న అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.
కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ
జులై 14వ తేదీ నుంచి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై క్యాబినెట్ చర్చించవచ్చు. రాజీవ్ యువవికాసం, సన్నబియ్యం పంపిణీ, ఇందిర మహిళా శక్తి సంబరాలు, స్వయం సహాయక బృందాలకు రుణాల మంజూరు వంటి అంశాలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
అభివృద్ధి - మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్లు, ప్రాజెక్టులు, వైద్య కళాశాలల నిర్మాణం, పాఠశాలల నిర్వహణ, ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపైన క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో భూముల విలువ పెంపు, మహిళలకు సవరించిన స్టాంప్ డ్యూటీ వంటి కీలక అంశాలపైన క్యాబినెట్ చర్చించనుంది. ప్రధానంగా రైతులకు, మహిళలకు లబ్ధి చేకూర్చే అంశాలు, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వర్షాకాల సమస్యలను ఎదుర్కోవడం వంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతీ నెలా రెండు సార్లు క్యాబినెట్ సమావేశం జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నేటి క్యాబినెట్ సమావేశం ఈ నిర్ణయంలో భాగమనే చెప్పాలి.






















