Bandi Sanjay Silent Protest: బండి సంజయ్ మౌనదీక్షలో కేసీఆర్ కోసం కుర్చీ- ఎందుకో వివరించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. హామీలు గుర్తు చేసేలా వేదికపై కుర్చీ వేశారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారని దాన్ని గుర్తు చేసేందుకు దీక్ష చేపట్టినట్టు బండి సంజయ్ తెలిపారు. ధరణి అనే దరిద్రపుగొట్టు పోర్టల్ తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఏ సమస్య వచ్చిన కూడా కూర్చీ వేసుకొని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారన్నారు. ఎనిమిదేళ్ల నుంచి ఇదే చెబుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారన్నారు. ఇంత వరకు ఏ సమస్యను కూడా పరిష్కరించలేదని ఆరోపించారు.
పల్లెల్లో ధరణి చిచ్చు
నోరు తెరిస్తే కేసీఆర్ అబద్దాలే చెబుతున్నారని విమర్శించారు బండి సంజయ్. ఆదివారం కూడా ప్రెస్‌మీట్ పెట్టి పచ్చి అబద్దాలే మాట్లాడారన్నారు బండి. ధరణి గొప్పగా ఉందని తనకు తానే కితాబు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి తగ్గించడానికి ధరణీ తీసుకొచ్చామని చెబుతున్న కేసిఆర్.... అవినీతి గురించి మాట్లాడితే... దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి పథకం అందుకే
కేసీఆర్ ఏ పథకం తీసుకొచ్చినా తన ఫ్యామిలీకి, తన బంధువులకు మేలు చేసేదే అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు బండి సంజయ్. అన్నింటిలో కేసీఆర్ స్వార్థం ఉంటుందే తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉండదన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములు రెగ్యులరైజ్ చేసుకోవడానికి.. గోల్‌మాల్ చేయడానికి కొత్త అవతారమెత్తి ధరణీ తీసుకొచ్చారన్నారు. ఎవరి జాగాలు ఎవరి పేరుమీద ఉన్నాయో... ఎవరి భూములు ఎవరికి పోయినాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. నలభై యాభై కింద భూములు అమ్మిన వాళ్లు, భూములు వదిలేసుకున్న వాళ్లు రైతులపై పడుతున్నారని ఉదహరింంచారు. తమకు భూములు ఇచ్చేయాలని రైతులను వేధిస్తున్నారన్నారు.
రైతులు ఏడుస్తున్నారు
ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఎవరో తీసుకుంటే రైతు గుండె పగులుతుందా లేదా అని ప్రశ్నించారు బండి. అలాంటివి చూసైనా కేసీఆర్ మనసు కరగడం లేదని... మానవత్వం లేని వ్యక్తి సీఎం కేసీఆర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. పేదోళ్ల ఇబ్బందులు తనకు అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ధరణితో ఎవరికి లాభం జరిగిందో సీఎం చెప్పాలని నిలదీశారు.
అంతా హైదరాబాద్‌లోనే
ధరణిలో సమస్య ఉంందని... సర్పంచ్, ఎంపీటీసీ లాంటి ప్రజాప్రతినిధులే దరఖాస్తులు ఇస్తున్నారని వివరించారు బండి. తప్పులు ఉన్నాయని తహసిల్దార్ వద్దకు వెళ్తే... నా చేతిలో ఏమీ లేదని అంతా డీఆర్‌వో పేరు చెబుతున్నారన్నారు. డీఆర్వో దగ్గరకు వెళ్తే.. ఆయన కలెక్టర్ పేరు చెబుతున్నారన్నారు. కలెక్టర్ వద్దకు వెళ్తే.. అంతా హైదరాబాద్‌లో ఉందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య రైతు తన భూమికి సంబంధించిన సమస్యను హైదరాబాద్ వెళ్లి పరిష్కరించుకునే స్తోమత కలిగి ఉంటాడా అని ప్రశ్నించారు బండి సంజయ్.
కోర్టుకెళ్లమంటున్నారు
ధరణిలో తప్పులు సరిదిద్దుకోవడానికి చెప్పులు అరుగుతున్నాయే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదన్నారు బండి సంజయ్. సమస్య పరిష్కరించాలని అధికారులకు ఉన్నప్పటికీ వాళ్ల చేతుల్లో అధికారం లేదన్నారు. లేని సమస్యను సృష్టించిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని మండిపడ్డారు. గట్టిగా అడిగితే కోర్టుకు వెళ్లమని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండారం బయటపడుతుందనే ఆందోళన
ధరణీ పోర్టల్ సమస్యల దరఖాస్తులతో రెవెన్యూ ఆఫీసులు నిండిపోయాయని ఎద్దేవా చేశారు బండి సంజయ్. దీని వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని... దీన్ని సరిదిద్దాలన్న ఆలోచన కూడా కేసీఆర్‌కు లేకపోవడం దారుణన్నారు. దీన్ని వేరేవాళ్లు ఎవరో చెప్పడం లేదని... స్వయంగా టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే చెబుతున్నారన్నారు. అయినా సీఎం కేసీఆర్ వినడం లేదన్నారు. ధరణి పోర్ట్ రద్దు చేస్తే తన ఫ్యామిలీ పేరు మీద ఉన్న భూముల బండారం బయటపడుతుందన్న భయంతో కేసీఆర్ సైలెంట్‌గా ఉండిపోతున్నారని విమర్శించారు బండి.
ధరణి మొత్తం తప్పులు తడకలే
ప్రజాసంగ్రామ యాత్ర చేసినప్పుడు కూడా ఎక్కువ ధరణిపై ఫిర్యాదులు వచ్చాయన్న బండి సంజయ్... అప్పుడే సీఎంకు లేఖ రాశానని గుర్తు చేశారు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికీ 15 లక్షలు ఎకరాల భూమి ధరణిలో నమోదు కాలేదని.. రిజిస్టర్ అయినవాటిలో భూముల్లో యాభై శాతం తప్పులే ఉన్నాయని వివరించారు. ఇప్పటికే అధికారులకు అధికారం ఇచ్చి... ప్రజా సమస్యను పరిష్కరించమని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు బండి.
పంట వేయమంటారు.. లాక్కుంటారు
పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని 2018 ఎన్నికల్లో చెప్పిన సీఎం కేసీఆర్... తర్వాత వచ్చిన ప్రతి ఉపఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు బండి సంజయ్. కుర్చీ వేసుకొని కూర్చొని ప్రజలకు తీపి కబురు చెప్తానన్న సీఎం ఇంత వరకు ఏం చేశారో చెప్పాలన్నారు. సమస్య పరిష్కరించకపోయినా పంట మాత్రం వేసుకోమంటారు... వెంటనే ప్రభుత్వాధికారులను పంపించి పంట ధ్వంసం చేయిస్తారని విమర్శించారు. ప్రశ్నించిన అడవి బిడ్డలపై లాఠీ ఛార్జీ చేస్తారన్నారు.
మూడెకరాలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఇవ్వని కేసీఆర్... పేదోళ్ల భూములను మాత్రం లాక్కుంటున్నారన్నారు సంజయ్. పేద ప్రజల భూముల్లోనే ప్రభుత్వాఫీసులు కడతారన్నారు. లేకుంటే ఆ భూములను టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసుకుంటారని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే జరుగుతోందని ఆరోపించారు. పంట వేసుకున్నప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రజానీకం వణికిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పోడు భూములు, ధరణి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టే... రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు అందివ్వాలని డిమాండ్ చేశారు. సమస్య ఉన్న ప్రాంతంలోనే కుర్చీవేసుకొని కూర్చొని పట్టాలు ఇవ్వాలన్నారు బండి సంజయ్.