Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్ ఎఫెక్ట్... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
Telangana News: హైదరాబాద్ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది టీఎస్‌ఆర్టీసీ. ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం వేళలో సిటీ బస్సులను సగానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచే ఈ విధానం అమలు కానుంది.
Hyderabad RTC Buses: ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం(Afternoon) 12గంటల అయితే... నడినెత్తిన చేరుతున్న భానుడు.. మాడు పగలగొడుతున్నాడు. ఇటీవల మూడు, నాలుగు రోజులు వాతావరణం కాస్త చల్లబడినా... మళ్లీ భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు... వాహనదారులను ఇబ్బందిపెడుతున్నాయి. కార్లలో వెళ్లే వారు సంగతి అటుంచితే... బైక్‌పై ప్రయాణించే వారు.. ఎండల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. సెకండ్ షిఫ్ట్ ఆఫీసులకు వెళ్లే వారు.. అత్యవసర పరిస్థితుల్లో మధ్యాహ్నం బయటకు వెళ్లాల్సిన మధ్యతరగతి ప్రజలు... ద్విచక్ర వాహనంపై వెళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారంతా... బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ... ఇప్పుడు వారికి ఆ అవకాశం కూడా లేకుండా చేసింది టీఎస్‌ఆర్టీసీ (TSRTC). మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లో సగం సిటీ బస్సులను తగ్గించేసింది.
మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటలకు సిటీ బస్సులను తగ్గిస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రంగానే ఉంటున్నారని.. బస్సులను ఖాళీగా తిప్పలేక... ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బస్సు సర్వీసులను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం... ఇవాళ్టి నుంచే అమలు చేస్తున్నట్టు తెలిపారు. నేడు (మంగళవారం) ఉదయం 5గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారాయన.. కానీ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల మధ్య పరిమితంగానే బస్సులను నడుపుతామని చెప్పారు. ఎండలు తగ్గేవరకు మధ్యాహ్నం వేళ...అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న జీహెచ్‌ఎంసీ అధికారుల హెచ్చరికను కూడా గుర్తుచేశారు ఆర్టీసీ అధికారులు.
మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు పరిమితంగా సర్వీసులు
హైదరాబాద్‌లో సిటీ బస్సులను నమ్ముకుని ప్రయాణించేవారు ఎంతో మంది ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులు తక్కువగా ఉన్నారని.. బస్సు సర్వీసులు తగ్గించేసింది టీఎస్‌ఆర్టీసీ. మధ్యాహ్నం వేళ ప్రయాణికులు తక్కువే గానీ.. అసలు లేకుండా అయితే లేరు. మరి... వారి పరిస్థితి ఏంటి..? అసలే మిట్ట మధ్యాహ్నం... ఆపై మండుటెండ... వీటితోపాటు బస్టాపుల్లో పడిగాపులు కాయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. బస్సు సర్వీసులను సగానికి తగ్గిస్తున్నామని చెప్పిన ఆర్టీసీ అధికారులు.. ఎన్ని తగ్గిస్తున్నామనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐదు నిమిషాలకు ఒక బస్సు తిరిగే చోట... 10 నిమిషాలకు ఒకటి నడుపుతామని మాత్రం ఒక అధికారి చెప్పారు.
హైదరాబాద్‌లో మొత్తం 2వేల 250 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు... ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఇవి ఈ బస్సులన్నీ తిప్పేవారు. కానీ... ఆర్టీసీ అధికారులు తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల... మధ్యాహ్నం వేళ 12వందల 75 బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొత్తం 2వేల 550 బస్సులు తిరుగుతాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు... సగం బస్సులకు విశ్రాంతి ఇస్తారు. అంటే ఆ సమయంలో 12 వందల 75 బస్సులు మాత్రమే తిరుగుతాయి. మళ్లీ... సాయంత్రం 4గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు మొత్తం 2వేల 550 బస్సులను తిప్పుతామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ అధికారులు తెలిపారు. మొత్తం బస్సులు తిరుగుతున్నప్పుడే.. బస్సుల కోసం చాలా సేపు వేచి చూడాల్సి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు... ఎండల పేరుతో.. ప్రయాణికులు రావడంలేదన్న సాకుతో... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులను సగానికి తగ్గించేశారు. మరి... ఇప్పడు బస్సు కోసం ఎంత సేపు వేచిచూడాలో మరి.