(Source: ECI/ABP News/ABP Majha)
KTR: ఆ సేవలు తెలంగాణకు బాగా అవసరం, కొవిడ్‌లో కీలక పాత్ర హైదరాబాద్‌దే - కేటీఆర్
శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వర్చువల్ విధానంలో జూమ్ ద్వారా మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనకు హైదరాబాద్ పెట్టింది పేరని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సును కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ డా. అనంత దురైయప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వర్చువల్ విధానంలో జూమ్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా యువతలో దయ, కరుణ గురించి మహాత్మాగాంధీ చెప్పారని కేటీఆర్ అన్నారు. పలు దేశాలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యవత, విద్యార్థులు సదస్సుకు తరలిచ్చారు. కన్హా శాంతి వనం సేవలు తెలంగాణకు చాలా అవసరమని, యువతలో నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నందుకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయ రంగంలో తెలంగాణ విప్లవాత్మక పురోగతి సాధించింది. తెలంగాణలో సెల్ఫ్ ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ విధానం అమల్లోకి తీసుకొచ్చి యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ వైరస్‌కు వ్యాక్సిన్‌ను తెలంగాణ నుంచే దేశానికి అందించాం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తుంది.’’
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌కు కేటాయిస్తున్నాం. ఎనిమిదేళ్లలో తెలంగాణలో 240 కోట్ల మొక్కలు నాటాం. వీటిలో 85 శాతం మొక్కలు బతికాయి. అంతేకాదు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది’’ అని కేటీఆర్ అన్నారు.
ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణకు చెందిన గ్రామాలే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ లో సైతం రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులిచ్చిందని గుర్తు చేశారు.
Live: Minister @KTRTRS speaking at the inaugural event of ‘International Youth Kindness Conference’ organised by @heartfulness https://t.co/G7k7uO35GX
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 12, 2022
అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి
‘‘మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి. అందుకు ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. మా పాత్ర పరిమితంగానే ఉంటుంది. అయితే మేము ప్రోత్సహించేందుకు కృషిచేస్తాం’’ అని అన్నారు.
మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన అన్న, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఇద్దరూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగానే కేటీఆర్ కుమారుడు, కుమార్తె కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
చిన్ననాటి ఫోటోలు ట్వీట్
మంత్రి కేటీఆర్ చిన్ననాటి ఫోటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ సోదరి కవితతో పాటు కేటీఆర్ తన చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. అలాగే కేటీఆర్ తన కుమార్తె అలేఖ్య, కుమారుడు హిమాన్షు ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Some bonds are so special 😊#HappyRakhi #HappyRakshabandan pic.twitter.com/9WPibLeQMi
— KTR (@KTRTRS) August 12, 2022