Hyderabad: హైదరాబాద్‌లో బాంబులతో ఇంటిని కూల్చేసిన అధికారులు- ఇద్దరికి గాయాలు
HYDRA: హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమార్కులు ఏ స్థాయిలో రెచ్చిపోయారో ఈ బిల్డింగ్ ఉదాహరణ. ఏకంగా చెరువు మధ్యలో ఈ నిర్మాణాన్ని కూల్చడానికి బాంబులు ఉపయోగించాల్సి వచ్చింది.
Hyderabad: హైదరాబాద్‌లో హైడ్రా ప్రభావంతో అక్రమ కట్టడాలు నేల కూలుతున్నాయి. ఎన్ని విమర్శలు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నా అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమంగా కట్టిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారు. అలానే సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని మల్కాపూర్‌లో కట్టడం కూల్చివేత కోసం బాంబులు వాడాల్సి వచ్చింది.
మల్కాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చే క్రమంలో ఏకంగా చెరువులోనే బిల్డింగ్‌ను అధికారులు గుర్తించారు. చెరువు ఎండిపోయినప్పుడు దాన్ని ఆక్రమించి భారీ భవనాన్ని నిర్మించేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. ఇప్పుడు వర్షాలు పడినందున ఆ భవనం నీటి మధ్యలో ఉంది.
నీటి మధ్యలో ఉన్న భవంతిని కూల్చేందుకు ప్రయత్నించిన అధికారులకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అక్కడి వరకు భారీ వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించారు. అందుకే బాంబులు ఉపయోగించి ఆ బహుళ అంతస్తు భవంతిని కూల్చేశారు.
ముందు ఆ భవనం కింద భాగంలో భవనానికి చుట్టూ బాంబులు చుట్టారు. అనంతరం అంతా బయటకు వచ్చి పేల్చేశారు. అయితే ఆ భవనం కూలే క్రమంలో పేలుడు ధాటికి శిథిలాలు వచ్చి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు తగిలాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు ఈఘటనలో గాయపడ్డారు.
చెరువు మధ్యలో కట్టిన ఈకట్టడానికి బయట నుంచి వెళ్లేందుకు మెట్లు కూడా నిర్మించారు. సెలవుల్లో ఇక్కడ ఆ యజమాని వచ్చి సేదతీరుతుంటారని స్థానికులు చెబుతున్నారు.