Terror Conspiracy Case: హైదరాబాద్ లో వరుస పేలుళ్ల కుట్ర నిందితులపై ఛార్జీషీట్ దాఖలు - ఏ1గా ఫర్హతుల్లా!
Terror Conspiracy Case: హైదరాబాద్ లో వరుస పేలుళ్ల ఉగ్రకుట్రకు యత్నించిన ముగ్గురు నిందితులపై ఎన్ఐఏ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. అలాగే కుట్రకు సూత్రధారి ఫర్హతుల్లానే అని తెలిపారు.
Terror Conspiracy Case: 2022వ సంవత్సరం దసరా పర్వదినం రోజు హైదరాబాద్ లో వరుస పేలుళ్లకు పాల్పడాలని ఉగ్ర కుట్రకు పథకం వేసిన నిందితులపై ఎన్ఐఏ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ జాహెద్, సమీయుద్దీన్ అలియాస్ సమీ, మాజ్ హసన్ ఫరూఖ్ అలియాస్ మాజ్.. పాకిస్థాన్ కు చెందిన లష్కరేకే చెందిన సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్ అలియాస్ అబూ హంజాలా, అబ్దుల్ మాజిద్ అలియాస్ చోటు ఇతర నేతలు, నిర్వాహకులతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వీరంతా కలిసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసినట్లు ప్రస్తావించింది. గతేడాది దసరా రోజున ఉగ్రకుట్ర పథకాన్ని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు.
లష్కరే తోయిబాతో సంబంధాలు పెట్టుకున్న నిందితులు
ఈ ఏడాది జనవరిలో కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. ఈ మేరకు దర్యాప్తు మొలు పెట్టిన సంస్థ బుధవారం నాంపల్లిలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. అలాగే నిందితులు జాహెద్, సమీ, మాజ్ లు లష్కరే తోయిబాతో సంబంధాలు ఏర్పరుచుకున్నారని ఎన్ఐఏ తెలిపింది. అలాగే లష్కరే నేతలు ఫర్హతుల్లా ఘోరీ, సిద్దిఖ్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మాజిద్ లు పాకిస్థానీలు, ఘోరీ తన కుట్ర కోసం అంతర్జాలం ద్వారా జాహెద్ ను నిమమించి హవాలా ద్వారా నిధులు పంపాడు. లష్కరేలో మరింత మందిని నియమించి ఉగ్రవాద కార్యకలాపాలు వేగవంతం చేయాలని ఆదేశించాడు. దీని ప్రకారం... సమీ, మాజ్, మహ్మద కలీమ్ లను లష్కరే కోసం పని చేసేలా ఉసిగొల్పాడు. పేలుళ్ల కుట్రలో భాగంగా హైదరాబాద్ - నాగ్ పూర్ జాతీయ రహదారిలోని మనోహరాబాద్ గ్రామ సమీపంలో సెప్టెంబర్ 28వ తేదీన డెడ్ డ్రాప్ విధానంలో నాలుగు హ్యాండ్ గ్రనేడ్లను ఉంచారు.
సమీ ద్వారా గ్రనేడ్లు తెప్పించుకొని చెరోటి ఇచ్చిన నిందితులు
సమీ ద్వారా హ్యాండ్ గ్రనేడ్లను జాహెద్ తెప్పించుకున్నాడు. వాటిని సమీ, మాజ్ లకు చెరొకటి ఇచ్చాడు. లష్కరే నేతల సూచనల ప్రకారం... దసరా రోజున భారీ ఎత్తున జనం గుమిగూడే ప్రాంతాల్లో వాటిని విసరాలని ఇద్దరికీ చెప్పాడు. ఈ కుట్రపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కుట్రను భగ్నం చేశారు. నిందితుల ఇళ్ల నుంచి నాలుగు గ్రనేడ్లు, జాహెద్ నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారని ఎన్ఐఏ ఛార్జిషీటులో వెల్లడించింది.