Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి అయింది. అర్థరాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించగా.. వేకువజాము నుంచి యాత్రను ప్రారంభించారు.
Khairatabad Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. వేల మంది భక్తుల నడుమ గణేష్ శోభాయాత్రలు ఘనంగా సాగుతుండగా.. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి అయింది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిని చేరాడు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద బుధవారం అర్ధరాత్రి దర్శనాలు నిలిపేశారు. రాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించారు. గురువారం వేకువ జామునే ఖైరతాబాద్ పార్వతీ తనయుడి విగ్రహాన్ని తరలించడం ప్రారంభించారు.
గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు
వినాయ నిమజ్జనానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ తరఫున 2 వేల వాహనాలు, జీహెచ్‌ఎంసీ 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మంది సిబ్బందిని నియమించారు. 50 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనానికి హుసేన్ సాగర్‌తో పాటు 33 చెరువులను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇక్కడ 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్‌ఎఫ్ బృందాలను రెడీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా వంద వరకు కృత్రిమ చెరువులు నిర్మించారు.
నిమజ్జనం సందర్భంగా రాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీస్‌లు పొడిగించారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్, పీవీ మార్గ్ పరిసరాల్లో ఉన్న పార్కులన్నీ మూసివేస్తున్నారు. వినాయకుడి శోభాయాత్రలు జరిగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు, ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.
చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను డైవెర్ట్ చేశారు. కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి అనుమతి ఉండదు. సికింద్రాబాద్‌లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాలను మళ్లిస్తున్నారు. టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ కూడలి, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాల మళ్లించారు.
నిమజ్జనం చేశాక ఎలా వెళ్లాలంటే..?
ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్తున్నాయి. బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి మీదుగా లారీలను అనుమతించడం లేదు.