Liquor Sale In Telangana: తెలంగాణలో పగిలిన బ్రీత్ అనలైజర్లు- ఒక్కరోజే రూ. 125 కోట్లు తాగేశారు
Liquor Sale In Telangana: డిసెంబర్ 31 నాడు మందుబాబులు రెచ్చిపోయారు. పార్టీల పేరుతో తాగిన తాగుడికి బ్రీత్ అనలైజర్ మీటర్లు పగిలే రీడింగ్స్ నమోదు అయ్యాయి.
Liquor Sale In Telangana On December 31st: కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ ఏరియాలో 1241 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
డిసెంబర్ 31 నాడు మందుబాబులు రెచ్చిపోయారు. పార్టీల పేరుతో ఫుల్‌గా బిగించేశారు. పూటుగా తాగేశారు. పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మీటర్లు పగిలే రీడింగ్స్ నమోదు అయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. తాగి వాహనాలు నడిపిన 1239 మందిపై కేసులు రిజిస్ట్ అయ్యాయి.
తాగి వాహనాలు నడిపిన వారి నుంచి వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో వాగ్వాదాలు జరిగాయి. వారిని బలవంతంగా వేరే వెహికల్స్‌లో ఎక్కించి ఇంటికి పంపించారు. ఇలా ఫుల్ డ్రింక్ చేసి వెహికల్స్ నడిపే వారి నుంచి 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 ఇతర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్ముడైంది. డిసెంబర్ 31న ఒక్కరోజే ప్రభుత్వానికి చెందిన 19 డిపోల నుంచి లక్షా 30వేల కేసు లిక్కర్, లక్షా 35వేల కేసుల బీర్ అమ్ముడైంది. దీని కారణంగా ప్రభుత్వానికి 125 కోట్లు ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాల ద్వారా మూడు రోజులలో 658 కోట్లు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది.