ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి వచ్చే ఎన్నికల వరకు తనకు సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాబోయే 2 సంవత్సరాలలో అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Teachers Day | టీచర్ల సమస్యలన్నీ రాబోయే రెండేళ్లలో పూర్తిగా పరిష్కరిస్తానని, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపకుండా విద్యార్థులకు టీచింగ్ పైనే దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- సీఎం రేవంత్ ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల సమయం కోరారు.
- ఉపాధ్యాయుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
- రోడ్లపై నిరసనలు రాష్ట్రానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
- సమస్యలు తీర్చకపోతే ఎన్నికలలో మార్కులు ఉపాధ్యాయుల ఇష్టమన్నారు.
కొడంగల్: ఉపాధ్యాయుల మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించడానికి వచ్చే ఎన్నికల వరకు తనకు సమయం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న టీచర్లు కనుక రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. రాబోయే 2 సంవత్సరాలలో ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తానని, ఆ తర్వాతే తాను ఎన్నికల్లో ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని చెప్పారు. ఒకవేళ తాను ఈ సమస్యలను పరిష్కరించకపోతే, వచ్చే ఎన్నికలలో తనకు ఎలాంటి మార్కులు వేస్తారో అది పూర్తిగా టీచర్ల ఇష్టమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిరసనల బాట వద్దు.. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం
మన సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ, వేలాది మంది పిల్లల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే బాధ్యత టీచర్లదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల తీరు వేరని, కానీ సమాజానికి దారి చూపించే టీచర్లు కనుక వీధుల్లోకి వచ్చి ధర్నాలు, దీక్షలు లేదా 'చలో హైదరాబాద్' వంటి నిరసనలు చేయడం రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఉపాధ్యాయులు నిరసనల బాట పడితే, ఈ ప్రభుత్వం తమ గురువులకు ఏదో అన్యాయం చేస్తోందని పిల్లల్లో తప్పుడు ఆలోచనలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఉపాధ్యాయులందరూ తమ పూర్తి దృష్టిని కేవలం విద్యార్థుల విద్యాబోధన పైనే పెట్టాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా, సీఎంగా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

2 సంవత్సరాల సమయం.. సమస్యల పరిష్కారానికి హామీ
టీచర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును బట్టి రాబోయే 2 సంవత్సరాల కాలంలో టీచర్ల ప్రతి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు తనకు రెండు సంవత్సరాల పాటు ఓపికపట్టి, సమయం ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్‌లో కానీ లేదా 2029 మార్చి/ ఏప్రిల్‌లో కానీ జరగవచ్చు అన్నారు. ఆ సమయంలో తాను ఓట్ల రూపంలో పరీక్ష రాయడానికి టీచర్ల వద్దకే వస్తానన్నారు.

తాను బడి దొంగను కాదని, పరీక్షల నుంచి తప్పించుకుని తిరిగే వ్యక్తిని కాదని, గత 1000 రోజుల్లో తాను ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని గుర్తుచేశారు. కనీసం ఒక గంట కూడా బయటకు రాని నేతలతో పోలిస్తే, బొమ్మ బొరుసు లాంటి ఈ వ్యత్యాసాన్ని గమనించాలని సూచించారు. ఒకవేళ తాను ఇచ్చిన మాట ప్రకారం సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే ఎన్నికల పరీక్షలో తనకు నూటికి నూరు మార్కులు వేస్తారో లేక గుండు సున్నా చుట్టి ఓడిస్తారో అది పూర్తిగా టీచర్ల నిర్ణయానికే వదిలేస్తున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Frequently Asked Questions
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంత సమయం కోరారు?
ఉపాధ్యాయులను నిరసనలకు దూరంగా ఉండమని సీఎం ఎందుకు కోరారు?
టీచర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని సీఎం అన్నారు. ఇది విద్యార్థుల్లో ప్రభుత్వంపై తప్పుడు ఆలోచనలు సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమిటి?
రాబోయే 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును బట్టి ఉపాధ్యాయుల ప్రతి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఈ బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో టీచర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సీఎం అన్నారు?
సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే ఎన్నికల పరీక్షలో నూటికి నూరు మార్కులు వేస్తారో లేక గుండు సున్నా చుట్టి ఓడిస్తారో అది పూర్తిగా టీచర్ల నిర్ణయానికే వదిలేస్తున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















