BJP Janasena Alliance: పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి కీలక భేటీ, పొత్తుపై చర్చ! 32 సీట్లు అడిగిన జనసేనాని
Telangana Elections 2023: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. సీట్ల పంపిణీపై మరోసారి చర్చ జరిగింది.
Pawan Kalyan Kishan Reddy Meeting:
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. నగరంలోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ ‘ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం. ఈ విషయంపై మరోసారి చర్చించాం. జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయి. రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై మరోసారి మాట్లాడుకుంటాం. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారు’ అని పవన్ తెలిపారు.
ఇటీవల ఎన్డీయే సమావేశానికి హాజరైన సందర్భంగా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడామని చెప్పారు. ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఇందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లు చెప్పారు. పొత్తులతో పాటు సీట్ల పంపిణీపై చర్చలు జరిపినందుకు కిషన్ రెడ్డికి జనసేనాని పవన్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు, సమన్వయంపై ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పారు. జనసేనతో పొత్తులపై కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బీజేపీ జాతీయ నాయకత్వంతో మాట్లాడటంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీతో కలిసి జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన, సభ.. పవన్ కు ఆహ్వానం
ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సభకు తనను ఆహ్వానించారని, తాను సభలో పాల్గొంటానని పవన్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ మాకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించిందన్నారు. ఇందుకుగానూ పవన్ కు బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు.
బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటు..
జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని, మరో రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని చెప్పారు. ఈ సభకు పవన్ కల్యాణ్ ని ఆహ్వానించాం అన్నారు. డా.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు. నరేంద్ర మోదీ దేశానికి మరోసారి ప్రధాన మంత్రి కావల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు. బీజేపీ భాగస్వామ్య పక్షంగా జనసేన మద్దతుతో తెలంగాణ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని లక్ష్మణ్ అన్నారు.