Minister Mallareddy : పవన్ కల్యాణ్ సినిమాలో విలన్ గా ఛాన్స్, మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమాలో తనకు విలన్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చిందన్నారు.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి మైక్ పట్టారంటే చాలు సంచలన వ్యాఖ్యలు చేయాల్సిందే. నేను తుమ్మినా తుపాన్ వస్తుందని చమత్కరిస్తుంటారు మంత్రి మల్లారెడ్డి. తాజాగా ఓ సినిమా టీజర్ లాంచ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆయన... సంచలన కామెంట్స్ చేశారు. యూట్యూబ్ స్టార్ సుమంత్ ప్రభాస్ మేమ్ ఫేమస్ అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ ప్రోగ్రామ్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇంకేంముంది మంత్రి మల్లారెడ్డి అంటేనే వైరల్. ఈ వేడుకలో మల్లారెడ్డి స్పీచ్ మళ్లీ హైలైట్ అయింది. ముందు మేము ఫేమస్ సినిమా గురించి మాట్లాడిన ఆయన కాసేపు అందర్నీ నవ్వించారు. జూన్ 2న ఈ సినిమా విడుదల అవుతుందని చెప్పారు. ఈ సినిమా ఓ చరిత్ర సృష్టిస్తుందని అంటూ జోష్ నింపారు. హీరో, హీరోయిన్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
నేను తుమ్మినా వైరల్
హీరో సుమంత్ మేకప్ వేసుకోకుండానే స్మార్ట్‌గా ఉంటాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సుమంత్ తెలంగాణ మోడల్ అన్న ఆయన.. రాబోయే రోజుల్లో దుమ్ము రేపుతాడని ధీమా వ్యక్తం చేశారు. చాయ్ బిస్కేట్ సంస్థ ఈ మధ్య మంచి మంచి సినిమాలు నిర్మిస్తుందని కితాబు ఇచ్చారు. సమాజంలో ఫేమస్ అవ్వాలంటే కష్టపడాలన్నారు. ముఖ్యంత యువత ఓ లక్ష్యాన్ని పెట్టుకుని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. లక్ష్యం దిశగా ప్రయాణించాలని చెప్పుకొచ్చారు. తన గురించి చెప్పుకొచ్చిన మల్లారెడ్డి... తాను తుమ్మినా వైరల్ అవుతుందని జోకులు వేశారు. అయితే ఫేమస్ అవడం వెనుక చాలా కష్టాలు ఉన్నాయన్నారు. తనేం గొప్ప వ్యక్తి కాదని తెలిపిన మల్లారెడ్డి...సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.
పవన్ సినిమాలో విలన్ పాత్ర
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా "ఉస్తాద్ భగత్ సింగ్"లో తనను విలన్ పాత్ర చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ కోరారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. హరీష్ శంకర్ తన దగ్గరకి వచ్చి పవన్ కల్యాణ్ తో చేసే సినిమాలో విలన్ గా నటిస్తావా అని గంటన్నర సేపు బ్రతిమిలాడాడని అన్నారు. కానీ తాను విలన్ పాత్రల్లో నటించనని చెప్పినట్లు తెలిపారు.
యువత...మద్యపానం, ధూమపానం, షికార్లు, అమ్మాయిల వెంట పడటం ఇలాంటివి చేస్తే ఫేమస్ కారన్నారు. కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ వస్తుందన్నారు. తాను పాలమ్మిన, పూలమ్మిన, కాలేజీలు పెట్టిన, టాప్ డాక్టర్లను, సైంటిస్టులను తయారుచేస్తున్నానని మల్లారెడ్డి జోష్ గా చెప్పారు. కాబట్టి యువత కష్టపడి పనిచేసి అన్నింటా ఫేమస్ అవ్వాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. ఏ ఒక్కరూ షార్ట్‌కట్‌లో సక్సెస్ కాలేరని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 23 ఏళ్లకే తనకు పెళ్లైందని, అప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదన్నారు. పాలు అమ్ముకునేవాడినన్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని తెలిపారు. యూత్ ఇప్పటికైనా షికార్లు బంద్ పెట్టి జీవితంలో ముందుకెళ్లడం గురించి ఆలోచించాలన్నారపు. మేమ్ ఫేమస్ సినిమా టీజర్ తనకెంతో నచ్చిందని, తప్పకుండా ఈ చిత్రం విజయం సాధింస్తుందన్నారు. త్వరలో సినీరంగంలో అడుగుపెడతానని చెప్పారు.