Asaduddin Owaisi : ముస్లింలకు నలుగురు భార్యలు చట్టబద్ధమే, నితిన్ గడ్కరీకి అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్
Asaduddin Owaisi : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ పై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు నలుగురు భార్యలు సాధారణమే అన్నారు.
Asaduddin Owaisi : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లింలకు నలుగురు భార్యలు ఉండడం అసాధారమని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ వ్యాఖ్యలను ఒవైసీ తప్పుబట్టారు. మీది మాత్రమే సంస్కృతా? మాది కాదా? అంటూ ప్రశ్నించారు. ముస్లింలు నలుగురు భార్యలు చేసుకోవడం చట్టబద్ధమే అన్నారు. వారికి భరణం, ఆస్తిలో వాట చట్ట ప్రకారం వస్తాయన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని గడ్కరీకి ఒవైసీ సవాల్ విసిరారు. కేవలం హిందువుల ఓట్ల మెజారిటీతో గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాదన్నారు.
పెద్ద హిందువు ఎవరనే చర్చ
ఓ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కన్నా పెద్ద హిందువు ఎవరనే విషయంపై రాజకీయ పోరాటం జరుగుతోందన్నారు. కాంగ్రెస్, ఆప్ సహా అన్ని రాజకీయ పార్టీల వైఖరి ఇలానే ఉందన్నారు. ముస్లిం సమాజంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. దిల్లీలో హత్యకు గురైన శ్రద్ధావాకర్ కేసులో మతపరమైన కోణం ఉంది కానీ లవ్ జిహాద్ సంఘటన కాదని ఒవైసీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అర్థం చేసుకోవాలన్నారు. లవ్ జిహాద్ అనే పదం అభ్యంతరం అన్నారు. దీనిపై చట్టం తేవడం మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అన్నారు.
యూసీసీపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల కామన్ సివిల్ కోడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు నలుగురు భార్యలు ఉండటం అసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం దేశాల్లో రెండు సివిల్ కోడ్‌లు ఉన్నాయా అని ప్రశ్నించారు. పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవడం సాధారణమేనన్న ఆయన... ముస్లిం వ్యక్తి నలుగురిని పెళ్లి చేసుకోవడం మాత్రం అసాధారణమన్నారు. ముస్లిం సమాజంలో ఉన్న అభ్యుదయవాదులు, విద్యావంతులు మాత్రం నాలుగు పెళ్లిళ్లు చేసుకోరని చెప్పారు. కామన్ సివిల్ కోడ్ ఏ మతానికి వ్యతిరేకం కాదని నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెస్తున్నామన్నారు. ఉమ్మడి పౌర శిక్షాస్మృతి (యూసీసీ)వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తుందన్నారు. రాష్ట్రాలు యూసీసీకి అనుకూలంగా ఉంటే యావత్ దేశానికి మేలు జరుగుతుందన్నారు.
అందరితో చర్చించి అమలు
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా యూసీసీ (Uniform Civil Code)పై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోడ్‌ను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే అంత కన్నా ముందు చర్చలు, వాదనలు తప్పకుండా వింటామని అన్నారు. జనసంఘ్‌గా ఉన్న నాటి నుంచే బీజేపీ ఈ హామీ ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. "బీజేపీ మాత్రమే కాదు. ఎప్పుడో మన రాజ్యాంగ పరిషత్ కూడా యూసీసీని సరైన సమయంలో అమలు చేయొచ్చని సూచించింది. సెక్యులర్ దేశంలో మతాల ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని చెప్పింది. రాష్ట్రాలన్నీ సెక్యులర్‌గా మారిపోతే అప్పుడు మతాల ఆధారంగా చట్టాల అవసరం ఎందుకు.." అని అన్నారు అమిత్‌షా.