CM Revanth Reddy: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు - ఆ ఫైలుపై నిమిషంలో సంతకం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలు సమకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

CM Revanth Announcement on Journalists Housing Lands: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు సమకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం జేఎన్ జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ, మీడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. జేఎన్ జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ 100 రోజుల్లోగా మొదలు పెడతానన్న హామీని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల (జేఎన్ జే) హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డితో సంస్థ ప్రతినిధులు చర్చించి ఓ ప్రణాళికతో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలోనే సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్ ఛైర్మన్ ను నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించామని గుర్తు చేశారు.
జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 16 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే నిజాంపేట, పేట్ బషీరాబాద్ లో 70 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని మీడియా ప్రతినిధులు సీఎం రేవంత్ కు తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని.. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా గత ప్రభుత్వ హయాంలో ఈ తీర్పు అమలు కాలేదని చెప్పారు. ఇప్పటివరకూ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు. దీనిపై రేవంత్ స్పందించారు. జేఎన్ జేలో సభ్యులైన జర్నలిస్టులకే కాకుండా మిగిలిన జర్నలిస్టులందరికీ స్థలాలు ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇందుకోసం మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందించాలన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతా కార్డులతో పాటు ఇతర సమస్యలపైనా దృష్టి సారించామని అన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. దీంతో మీడియా ప్రతినిధులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Greater City Corporation: గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















