MLA Etela Rajender : పోలీస్ రిక్రూట్మెంట్లో తీవ్ర అన్యాయం, సీఎంకు అభ్యర్థుల గోస పట్టదా: ఎమ్మెల్యే ఈటల
MLA Etela Rajender : దేశం మొత్తంలో లాంగ్ జంప్ లో 3.8 మీటర్లకు ఎంపిక చేస్తుంటే తెలంగాణలో మాత్రం 4 మీటర్లు ఎందుకు పెట్టారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
MLA Etela Rajender : 2022 పోలీస్ రిక్రూట్ మెంట్ లో అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే..సీఎం కేసీఆర్ మాత్రం ఏమి పట్టనట్టు నీరో చక్రవర్తిలాగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఏమైంది?
కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటిపోయినా ఉద్యోగాల తలరాతలు మారలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చిన కేసీఆర్..అత్తెసరు జాబ్స్ ప్రకటించి చేతులు దలుపుకున్నారని దుయ్యబట్టారు. ఈ మధ్యకాలంలో ఇచ్చిన నోటిఫికేషన్లను చూస్తే పొమ్మనలేక పొగబెట్టినట్టు ఉందన్నారు. వివిధ రకాల సాకులు చూపించి ఉద్యోగాల భర్తీ చేయడం లేదన్నారాయన. జె.ఎల్.ఎం ఉద్యోగాల్లో మాస్ కాపీ జరిగిందని రద్దు చేశారని.. సింగరేణి ఉద్యోగాలను కూడా అలాగే చేశారని ఈటల మండిపడ్డారు. 2022 పోలీస్ రిక్రూట్మెంట్లో అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఈటల రాజేందర్ కు మొర పెట్టుకున్నారు. న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం నీరో చక్రవర్తిలాగా ఫామ్ హౌస్ లో పడుకున్నారు
నోటిఫికేషన్లు తాటికాయ అంత అక్షరాలతో ఇచ్చి నియామకాలు మాత్రం చేయడం లేదన్నారు ఈటల. ఎస్సై, కానిస్టేబుల్, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ కి.. యూనిఫామ్ సర్వీస్ లో ఉన్న ఉద్యోగాలకు అన్నిటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలో ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేర్వేరు హైట్ ఉన్నవారికి కానిస్టేబుల్ గా సెలెక్ట్ చేసేవాళ్లు. కానీ వీటన్నిటిని క్లబ్ చేసి పొమ్మనేని పొగ పెట్టారని ఈటల విమర్శించారు. దేశం మొత్తంలో లాంగ్ జంప్ లో 3.8మీటర్లకు ఎంపిక చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం నాలుగు మీటర్లు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త నిబంధనలుతో లక్షమంది డిస్ క్వాలిఫై అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం అభ్యర్థులు ఎంతమంది నాయకులు.. మంత్రుల ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఏమి పట్టనట్టు నీరో చక్రవర్తిలాగా ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ఉద్యోగ నోటిఫికేషన్లు
పగలురాత్రి కష్టపడి, అమ్మానాన్న పంపించిన మూడు, నాలుగు వేల రూపాయలతో లైబ్రరీ కుర్చీల్లో కూర్చొని చదువుతుంటే.. వాళ్లకు పోలీస్ ఉద్యోగం అందని ద్రాక్షలాగా చేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐదు ఈవెంట్లో మూడు సెలెక్ట్ అయితే సరిపోయేది. కానీ ఇప్పుడు మూడు ఈవెంట్స్ పెట్టి ఒకటి ఎంపిక కాకపోయినా డిస్క్ క్వాలిఫై చేయడం సరికాదన్నారు. రన్నింగ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరిని ఫైనల్ ఎగ్జామ్ కి అనుమతించాలని..ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన 165 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నవారికి అవకాశం కల్పించాలని ఈటల డిమాండ్ చేశారు. పాత నిబంధన ప్రకటమే ఎంపిక చేయాలన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెట్టడం కోసం నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావుకి పోలీస్ అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.