Amit Shah: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనకు అమిత్ షా - షెడ్యూల్ ఇదే!
Telangana News: పార్లమెంట్ ఎన్నికల తరుణంలో తెలంగాణపై అమిత్ షా నజర్ వేశారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేసేందుకు రాష్ట్రానికి వస్తున్నారు.
Amit Shah Tour in Telangana: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణపై కాషాయ పార్టీ దృష్టి పెట్టింది. అగ్రనేతలు వరుసగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మోదీ పర్యటనతో టీబీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపగా.. పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం చేసేందుకు ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
సోషల్ మీడియా వారియర్లతో మీటింగ్
ఈ నెల 12న హైదరాబాద్ రానున్న అమిత్ షా.. బీజేపీ సోషల్ మీడియా వారియర్లతో సమావేశం కానున్నారు. దాదాపు మూడు వేల మంది సోషల్ మీడియా కార్యకర్తలు ఈ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సూచనలు చేయనున్నారు. ఇటీవల మోదీ రాష్ట్రానికి రాగా.. కొద్ది రోజుల వ్యవధిలోనే అమిత్ షా కూడా రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అగ్రనేతల రాకను బట్టి చూస్తే తెలంగాణలో పార్టీ బలోపేతంపై కమలదళం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ప్రచారం నడుస్తోంది. అంతకంటే ముందు అమిత్ షా వస్తుండటం కీలకంగా మారింది.
పది ఎంపీ సీట్లపై కన్ను
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లను గెలుచుకోవాలనేది బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల విజయ సంకల్ప యాత్ర, రథ యాత్రలను నిర్వహించింది. అలాగే ఇటీవల ప్రకటించిన బీజేపీ తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి నేతలను చేర్చుకోవడంపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం గూటికి చేరారు. వారిలో రాములు నాయక్ కుమారుడు భరత్‌కు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ బీజేపీ కేటాయించగా.. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చారు. బీజేపీ తరపున ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్‌లను పార్టీలో చేర్చుకుని బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఈ సారైనా పుంజుకుంటుందా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుని సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లలో విజయం సాధించింది. దీంతో ఈ సారి అంతకంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఆ పార్టీలోని చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది.