Telangana Politics: తెలంగాణలో గుర్తింపు రద్దు దిశగా 13 పార్టీలు! ఎన్నికల సంఘం నోటీసులు, కారణాలు ఇవే
తెలంగాణలోని 13 పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే షాక్ ఇచ్చింది. "ఎందుకు మీ పార్టీలను రద్దు చేయకూడదో కారణాలు చెప్పాలని" ఈ షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.

Telangana Political Parties | తెలంగాణలోని 13 పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే షాక్ ఇచ్చింది. "ఎందుకు మీ పార్టీలను రద్దు చేయకూడదో కారణాలు చెప్పాలని" ఈ షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ 13 పార్టీలు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని, "ఎందుకు పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయకూడదో స్పష్టమైన వివరణ ఇవ్వాలని" రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సి. సుదర్శన్ రెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు.
రద్దు చేయనున్న 13 పార్టీలు ఇవే (Telangana Politics)
-
తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ (హనుమకొండ)
-
ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ (హైదరాబాద్)
-
జాగో పార్టీ (హైదరాబాద్)
-
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (హైదరాబాద్)
-
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ (హైదరాబాద్)
-
తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం (హైదరాబాద్)
-
యువ పార్టీ (హైదరాబాద్)
-
బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) (మేడ్చల్-మల్కాజ్‌గిరి)
-
తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ (మేడ్చల్-మల్కాజ్‌గిరి)
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ (రంగారెడ్డి)
-
జాతియా మహిళా పార్టీ (రంగారెడ్డి)
-
యువ తెలంగాణ పార్టీ (రంగారెడ్డి)
-
తెలంగాణ ప్రజా సమితి (వరంగల్)
ఈ 13 పార్టీలు జులై 11, 2025 లోగా షోకాజ్ లో పేర్కొన్న అంశాలకు పార్టీ అధ్యక్షుడు లేదా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ సహా వివరణను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎన్నికల సంఘం పార్టీల గుర్తింపును ఎందుకు రద్దు చేస్తుంది?
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడానికి అనేక విషయాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేస్తాయి. 1968 ఎన్నికల నియమావళిలో రూపొందించిన నిబంధనలను ఏదైనా పార్టీ ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, ఆ పార్టీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతుంది. ఆ వివరణ నిబంధనలకు అనుగుణంగా లేనట్లయితే పార్టీ గుర్తింపును లేదా రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తుంది.
పార్టీల గుర్తింపు రద్దుకు ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకునే కారణాలు ఇవే:
-
పార్టీ క్రియాశీలకంగా లేకపోవడం: ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన తర్వాత ఆ పార్టీ ఎక్కువ కాలం క్రియాశీలకంగా ఉండకపోతే, అంటే రెండు వరుస సాధారణ ఎన్నికలు లేదా ఆరేళ్ల పాటు క్రియాశీలకంగా లేకపోతే పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అంటే ఆ ఆరేళ్లలో లేదా రెండు సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికల్లో గానీ, రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో గానీ, ఉపఎన్నిక జరిగితే ఆ ఉపఎన్నికల్లో గానీ పోటీ చేయకపోతే ఆ పార్టీ క్రియాశీలకంగా లేనట్లు. ఈ కారణంతో ఎన్నికల సంఘం పార్టీ గుర్తింపును రద్దు చేయవచ్చు.
-
పార్టీ కార్యాలయ చిరునామాలు తప్పుగా ఇచ్చినా గుర్తింపు రద్దే: ఏదైనా పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలో ఆ పార్టీ కార్యాలయం ఉండకపోతే ఎన్నికల సంఘం పంపే ఉత్తరాలు, నోటీసులు అందవు. పార్టీలతో ఎన్నికల సంఘం చేసే ఉత్తర ప్రత్యుత్తరాలకు పార్టీ అందుబాటులో లేకుండా పారదర్శకత లేకపోవడం, పార్టీ బాధ్యతారాహిత్యం కింద ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ కారణంతో కూడా ఎన్నికల సంఘం పార్టీ గుర్తింపును రద్దు చేయవచ్చు.
-
ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘించినా గుర్తింపు రద్దే: రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన తర్వాత ఆ పార్టీ వార్షిక ఆడిట్ నివేదికలు, విరాళాలు సేకరించిన తర్వాత ఆ వివరాలు, ఎన్నికల్లో పార్టీ పెట్టే ఖర్చు వివరాలను తప్పనిసరిగా సకాలంలో ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఈ నిబంధన పాటించకపోవడం ఎన్నికల నియమావళి ప్రకారం అతి పెద్ద ఉల్లంఘనగా చెప్పవచ్చు.
-
అక్రమ నిధుల సేకరణ చేస్తే గుర్తింపు రద్దే: పార్టీ కార్యక్రమాల కోసం లేదా ఎన్నికల ఖర్చు కోసం అక్రమ పద్ధతుల్లో నిధులు సేకరించినట్లు రుజువైతే ఆ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. మనీలాండరింగ్ వంటి చట్ట వ్యతిరేక పద్ధతుల్లో నిధులు సమకూర్చుకున్నట్లు తెలిసినా ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తింపును రద్దు చేస్తుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పార్టీ అయినా నిధుల సేకరణ, వినియోగంలో పారదర్శకత పాటించాల్సి ఉంది.
-
పార్టీ బైలాస్‌ను పాటించకపోతే గుర్తింపు రద్దే: పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎన్నికల సంఘం నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే పార్టీ బైలాస్ అంటే రాజ్యాంగం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ బైలాస్‌ను ఉల్లంఘిస్తే పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది.
గుర్తింపు రద్దు అయితే ఏం అవుతుంది?
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల మాదిరి ప్రత్యేక ప్రయోజనాలు ఉండవు. అంటే ఎన్నికల గుర్తు కోల్పోతుంది. ఎన్నికల సమయంలో గుర్తుల జాబితా నుండి తాము కోరుకునే గుర్తును ఎన్నికల సంఘం ఆ పార్టీలకు ఇస్తుంది. ఆ గుర్తుతో పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేయవచ్చు. అయితే గుర్తింపు రద్దు అయితే పలు నియోజకవర్గాల్లో ఒకే గుర్తు దక్కే అవకాశం లేదు. ప్రభుత్వ టీవీ, రేడియోలలో ప్రచారం చేసుకునే అవకాశం గుర్తింపు రద్దు అయిన పార్టీలకు ఉండవు. అంతే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎక్కువ మంది ప్రతిపాదకులు అవసరం ఏర్పడుతుంది. స్టార్ క్యాంపెయినర్లు తక్కువ మంది ఉంటారు. ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వసనీయత దెబ్బ తింటుంది. ఎన్నికల నిబంధనలను రూపకల్పన చేసే సమయంలో నమోదు చేయబడిన (రిజిస్టర్డ్), గుర్తింపు పొందిన (రికగ్నైజ్డ్) పార్టీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. గుర్తింపు రద్దు అయిన పార్టీలను ఎన్నికల సంఘం ఆహ్వానించదు.
అయితే ఈ 13 పార్టీలు జులై 11, 2025లోగా తమ వివరణను, అఫిడవిట్ తో సహా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దానిపై జులై 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ 13 పార్టీల రద్దు అంశంపై నిర్ణయం తీసుకోనుంది.





















