Virender Singh: నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా , సాక్షి మాలిక్‌ను చూసి గర్వపడుతున్నా
Virender Singh: సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నికవడంతో వివాదం కొనసాగుతోంది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో దిగ్గజ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్ పాత్ పై పెట్టి పునియా నిరసన వ్యక్తం చేశారు. తాము గతంలో 40 రోజుల పాటు తీవ్రంగా ఉద్యమం చేశామని అందులో బ్రిజ్ భూషణ్ తన పలుకుబడితో తమని అణిచివేశారని ప్రధానిని ఉద్దేశిస్తూ బజ్ రంగ్ పునియా లేఖను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది.
ఇప్పటికే రెజ్లర్లకు దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలవగా... తాజాగా సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ దేశ బిడ్డ, సోదరి సాక్షి మాలిక్ కోసం పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రెజ్లర్ వీరేంద్ర సింగ్ తెలిపాడు. సాక్షి మాలిక్ ను చూసి గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. దేశంలోని మిగతా అగ్రశేణి క్రీడాకారులు కూడా దీనిపై తమ నిర్ణయాన్ని చెప్పాలని కోరాడు. ఇప్పటికే సాక్షిమాలిక్‌కు దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతుగా నిలిచాడు. దీనిపై రాష్ట్రపతి, ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. ఒక క్రీడాకారుడిగా సాక్షి మలిక్ బాధను తాను అర్థం చేసుకోగలనని విజేందర్ అన్నాడు. రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణి.. నేడు న్యాయం కోసం పోరాటం చేసిందని గుర్తు చేశాడు. కానీ ఈ పోరాటంలో ఆమెకు న్యాయం జరగలేదని.. ఆవేదనకు గురైన ఆమె ఆటకు వీడ్కోలు పలికిందని విజేందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటివి జరిగిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెలను మైదానాలకు పంపిస్తారా అని ప్రశ్నించాడు.
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగాబీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నిక అవటంపై భారత స్టార్ రెజ్లర్లు...తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక బరిలోకి దిగటం తన వల్ల కాదంటూ భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ (Sakshi Malik) కెరియర్‌కు వీడ్కోలు పలికింది. సంజయ్ సింగ్ ఎన్నిక జరిగిన కొద్దిసేపటికే సాక్షి మాలిక్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు.
బజరంగ్ పునియా పద్మశ్రీ అవార్డును తిరిగివ్వడంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ నిర్ణయం పూర్తిగా అతడి వ్యక్తిగతమని, డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు మాత్రం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయని స్పష్టం చేసింది. బజరంగ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రిత్వశాఖ సూచించింది.