Laxman to Coach India: టీమ్‌ఇండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్! ఆదేశించిన బీసీసీఐ? మరి ద్రవిడ్ ?
India vs SA T20 Series: హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) మరో కొత్త పాత్రలోకి రంగప్రవేశం చేయనున్నాడు. టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు!
India vs SA T20 Series: హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) మరో కొత్త పాత్రలోకి రంగప్రవేశం చేయనున్నాడు. టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు! దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత టీ20 జట్టుకు అతడే కోచ్‌గా వెళ్తాడని తెలిసింది. ఈ సిరీసుకు రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ బృందం వెళ్లదని సమాచారం. సీనియర్లతో కూడిన జట్టుతో వారు ఇంగ్లాండ్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది.
ఐపీఎల్ 2022 మరో 10 రోజుల్లో ముగియనుంది. ఇది పూర్తవ్వగానే టీమ్‌ఇండియాకు వరుసగా రెండు పర్యటనలు ఉన్నాయి. మొదట పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉంటుంది. కాగా ఈ రెండు పర్యటనలకు రెండు వేర్వేరు జట్లు, వేర్వేరు కోచింగ్ బృందాలను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా ఉంటారని సమాచారం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచులూ సెపరేట్‌గానే ఉంటారని అంటున్నారు. అంటే ఎన్‌సీఏ కోచింగ్ స్టాఫ్ వీరివెంట వెళ్లనుంది.
ఇక జూన్ 15 లేదా 16న టీమ్‌ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ గతంలో ఆగిపోయిన ఒక టెస్టు, టీ20, వన్డే సిరీసులు ఆడనుంది. దీనికి సీనియర్లతో కూడిన భారత జట్టును ఎంపిక చేయనున్నారు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని కోచింగ్ బృందం వీరితో వెళ్లనుంది. అంటే రెండు పర్యటనలకు పూర్తిగా వేర్వేరు జట్లు, కోచింగ్ బృందాలు ఉంటాయన్నమాట! దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. మహ్మద్ షమీని ఇందులో చేరుస్తారో లేదో తెలియదు.
ఇక దక్షిణాఫ్రికా సిరీసుకు సంజు శాంసన్‌తో పాటు హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్, మొహిసిన్ ఖాన్, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్‌కు ఛాన్స్ దొరుకుతుందని తెలుస్తోంది. ఈ జట్టుకు బహుశా శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేస్తాడని అంటున్నారు. శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి టెస్టు జట్టుకు ఎంపికవ్వనున్నారు. ఫిట్‌నెస్ టెస్టు ఫలితాలను బట్టి సూర్యకుమార్, దీపక్ చాహర్‌ను ఎంపిక చేస్తారు.
'బర్మింగ్‌హామ్ టెస్టుకు ముందు జూన్ 24 లీసెస్టర్‌షైర్‌తో టీమ్‌ఇండియా వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. జూన్ 15 లేదా 16న రాహుల్ ద్రవిడ్‌తో పాటు జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో టీ20లకు వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా ఉండాలని అడిగాం' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.