IndU19 vs AusU19, Semi Final: ఆస్ట్రేలియా ముంగిట భారీ లక్ష్యం.. కెప్టెన్ యష్ సెంచరీ!
అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది.
అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు.. ఆస్ట్రేలియాకు 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేశారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ యష్ ధుల్ (110: 110 బంతుల్లో, పది ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (94: 108 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) త్రుటిలో సెంచరీ మిస్ చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. మొదటి వికెట్‌కు 7.4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే జోడించాక ఓపెనర్ ఆంగ్‌క్రిష్ రఘువంశీ (6 : 30 బంతుల్లో) అవుటయ్యాడు. వెంటనే 13వ ఓవర్లో 37 పరుగుల వద్ద మరో ఓపెనర్ హర్‌నూన్ సింగ్ (16: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా అవుటయ్యాడు.
ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్, కెప్టెన్ యష్ ధుల్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 33.2 ఓవర్లలో ఏకంగా 204 పరుగులు జోడించారు. అయితే దురదృష్టవశాత్తూ వీరిద్దరూ 46వ ఓవర్లో వరుస బంతుల్లో అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన రాజ్‌వర్థన్ హంగర్గేకర్ (13: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), నిషాంత్ సంధు (12 నాటౌట్: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), దినేష్ బానా (20 నాటౌట్: 4 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో భారత్ 50 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ నిస్బెట్, విలియమ్ సల్జ్‌మాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి సెమీస్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఇంగ్లండ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఫిబ్రవరి 5వ తేదీన ఇంగ్లండ్‌తో ఫైనల్లో తలపడనుంది. ఓడితే ఆఫ్ఘనిస్తాన్‌తో ఫిబ్రవరి 4వ తేదీన మూడో స్థానం కోసం పడనుంది.
View this post on Instagram