China Masters 2023 badminton: ఫైనల్లో భారత స్టార్ జోడీ, ప్రతిష్ఠాత్మక టైటిల్‌కు అడుగే దూరం
China Masters 2023 badminton: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ మరో టైటిల్‌కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి( Satwik-Chirag) జోడీ మరో టైటిల్‌కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీ(China Masters 2023 badminton tournament) లో ఈ స్టార్ డబుల్స్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో (Semi-Final) సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 21-15, 22-20తో హి జి టింగ్-రెన్ జియాంగ్ (చైనా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల పాటు సాగిన సెమీస్‌లో ప్రతి పాయింట్ కోసం రెండు జంటలూ చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రతి పాయింట్‌కు భారత జంట సమన్వయంతో శ్రమించింది. తొలి గేమ్‌లో సగం వరకు సాత్విక్, చిరాగ్ జోరు ప్రదర్శించారు. భారత జోడీ దూకుడుగా ఆడి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో హోరాహోరీ పోరు జరిగింది. పాయింట్ల కోసం ఇరు జోడీలూ కొదమ సింహల్లా తలపడ్డాయి.
ఇరు జోడీలు తీవ్రంగా పోరాడడంతో 20-20 వద్ద స్కోరు సమమై తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే సాత్విక్, చిరాగ్ అనుభవాన్ని అంతా ఉపయోగించి రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయారు. టాప్ సీడ్ సాత్విక్-చిరాగ్ జోడీ ఆదివారం ఫైనల్లో రెండో సీడ్ లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ (చైనా) ద్వయంతో అమీతుమీ తేల్చుకోనుంది. గత ఏడాది సాత్విక్-చిరాగ్ ఫ్రెంచ్ ఓపెన్‌తో తొలి సూపర్ 750 టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నారు. మరో టైటిల్ కోసం తామెంతో ఆకలితో ఉన్నామని సాత్విక్ చెప్పాడు.
ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లోనూ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట కొరియా ఆటగాళ్లు చో సోల్గూ, కిమ్ వోంగూ పై 21-18, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నెగ్గిన తొలి స్వర్ణం ఇది. తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 58 ఏళ్లలో భారత్ కు తొలి స్వర్ణ పతకం అందించారు. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ లో 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చాడు. 1971లో దీపు ఘోష్, రామన్ ఘోష్ జంట డబుల్స్ లో కాంస్య పతకం సాధించారు.
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్‌లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్‌లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్‌లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2018లో), మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్ (2021లో) ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు.