World Cup 2023: ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ డేట్ ఫిక్స్? - ఎక్కడ జరగనుంది?
2023లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుందని తెలుస్తోంది.
World Cup 2023 IND vs PAK Match: వన్డే ప్రపంచ కప్ ఈ సంవత్సరం చివరిలో మనదేశంలో జరగనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. అయితే భారత అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ తేదీ తెరపైకి వచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం అక్టోబర్ 15వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ని చెపాక్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ ముంబైలో జరిగే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీన ఆడే అవకాశం ఉంది. 2019 ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ కూడా ఈ జట్ల మధ్యే జరిగింది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. ప్రపంచ కప్ 2023లో ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడవచ్చు. నవంబర్ 19వ తేదీన ఈ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం ఐసీసీ రాబోయే ప్రపంచ కప్ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత ప్రపంచ కప్ షెడ్యూల్‌ను విడుదల చేయవచ్చు. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ?
వన్డే ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లేందుకు పాకిస్థాన్ అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2023 ఆసియా కప్ కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లకపోతే ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లబోమని పీసీబీ గతంలో పేర్కొంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగవచ్చని కొన్ని వార్తల్లో పేర్కొన్నారు. అయితే అహ్మదాబాద్‌లో ఆడేందుకు పాకిస్థాన్ అభ్యంతరం తెలిపిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్‌ను వేరే వేదికకు మార్చవచ్చు. వార్తల ప్రకారం పాకిస్తాన్ తన మ్యాచ్‌లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆడవచ్చు.
2023 వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ కోసం 10 జట్ల మధ్య పోరు జరగనుంది. ఇందు కోసం ఎనిమిది జట్లు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. క్వాలిఫయర్స్ ఆడిన తర్వాత మరో రెండు జట్లు అర్హత సాధించనున్నాయి. టోర్నమెంట్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంలో ఒక్కో జట్టు దాదాపు తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడుతుంది.
ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. జింబాబ్వేలో జూన్ 18వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా చివరి రెండు స్థానాలను భర్తీ చేస్తారు. ఇందులో శ్రీలంక, వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, ఒమన్, యూఏఈ, ఐర్లాండ్, నేపాల్, స్కాట్లాండ్, అమెరికా జట్లు ఉన్నాయి.
#WorldCup2023 ⭐#INDvsPAK : India Will Take On Pakistan At OCTOBER 15 (Sunday)🔥
— Saloon Kada Shanmugam (@saloon_kada) May 10, 2023
At Narendra Modi Stadium.