Umesh Yadav: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ - టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఉమేష్ యాదవ్ దూరం!
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌కు ముందు భారత్‌కు మరో ఎదురుదెబ్బ. ఉమేష్ యాదవ్ కూడా గాయంతో బాధపడుతున్నాడు.
Umesh Yadav Injury: ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఒకవైపు జరుగుతున్నాయి. అదే సమయంలో దీని తర్వాత భారత క్రికెటర్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సిద్ధమవుతారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి ఓవల్‌లో జరగనుంది.
ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా సవాల్ విసరనుంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో పోరాడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఉమేష్ యాదవ్‌ను దూరం కాక తప్పదని భావిస్తున్నారు. ఇదే జరిగితే టీమ్‌ఇండియాకు పెద్ద దెబ్బే.
ఐపీఎల్‌లో ఉమేష్ యాదవ్ రాబోయే మ్యాచ్‌లలో ఆడతాడా?
ఉమేష్ యాదవ్ ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ నుంచి ఉమేష్ యాదవ్ తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే ఉమేష్ యాదవ్ ఐపీఎల్ 2023 సీజన్‌లో రాబోయే మ్యాచ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడతాడా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియలేదు. అయితే అతను గాయం నుండి కోలుకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీలో కనిపించవచ్చు.
ఉమేష్ యాదవ్ గాయం భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు శుభవార్త కాదు. ఎందుకంటే భారత జట్టులో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయాలతో పోరాడుతున్నారు. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడరు. ప్రస్తుతం భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఈ గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ప్లేయర్ల ఎంపికను పరిశీలిస్తోంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు (WTC Final 2023) టీమ్‌ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్ డిపెండబుల్' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్ 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. జూన్ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్‌లోని ఓవల్ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్‌మ్యాన్ సేన తలపడుతుంది.
టీమ్‌ఇండియాకు దొరికిన అద్భుతమైన ఆటగాళ్లలో అజింక్య రహానె (Ajinkya Rahane) ఒకడు. దేహానికి దూరంగా వెళ్తున్న బంతుల్ని చక్కగా ఆడతాడు. స్వింగ్, సీమ్, క్రాస్ సీమ్, స్పిన్‌ను బాగా ఎదుర్కొంటాడు. విదేశాల్లో పేసర్లు వేసే బంతుల్ని అడ్డంగా ఆడగలడు. ఏడాది కాలంగా అతడు ఫామ్‌లో లేడు. దాంతో వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారు. దక్షిణాఫ్రికాలో కౌప్‌టౌన్ టెస్టు నుంచి పక్కన పెట్టేశారు. ఆ పర్యటనలో 6 ఇన్సింగ్సుల్లో అతడు 136 పరుగులే చేశాడు.
టీమ్‌ఇండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్