IPL 2025: ఐపీఎల్ 2025కి ముందు మెగా ఆప్షన్ వద్దన్న షారుఖ్, కావ్య- పంజాబ్ జట్టు యజమానితో వాగ్వాదం
IPL Owners Meeting: ఐపీఎల్ యజమానుల మీటింగ్‌ను బీసీసీఐ నిర్వహించింది. కీలక అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో పలు జట్ల యజమానుల మధ్య వివిధ అంశాలపై వాడి వేడి చర్చ సాగింది.
IPL 2025 : ఐపీఎల్ జట్ల యాజమాన్యాలతో బీసీసీఐ కీలక సమావేశాన్ని బుధవారం నిర్వహించింది. ముంబై వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఐపీఎల్ జట్లకు సంబంధించిన యజమానులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి వాడీవేడిగా చర్చ సాగింది. ప్రధానంగా ఐపీఎల్-2025కి ముందు ఆటగాళ్ల మెగా వేలం నిర్వహించడానికి సంబంధించి పలు జట్ల యజమానుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మెగా ఆక్షన్ కు ముందు రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో ఫ్రాంచైజీ ఓనర్ల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు బీసీసీఐ నిర్ణయించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్, పంజాబ్ జట్టు యజమాని నెస్ వాడియా మధ్య ఒక రకమైన వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ఐపీఎల్ కు ముందు మెగా వేలం నిర్వహించాలన్న నెస్ వాడియా అభిప్రాయంపై కోల్ కతా జట్టు యజమాని షారుక్ ఖాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మినీ వేలం నిర్వహిస్తే సరిపోతుందని ఆయన ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. షారుఖ్ ఖాన్ ప్రతిపాదనపై పంజాబ్ జట్టు యజమాని నెస్ వాడియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా ఆక్షన్ ఉండాలని, అయితే రిటెన్షన్ ప్లేయర్ల విషయంలో సంఖ్య ఎనిమిది వరకు ఉండాలని వాడియా సూచించారు. దీనికి షారుఖ్ ఖాన్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం అవసరం లేదని, మినీ ఆక్షన్ కు వెళ్దామని, అందులో మరో ఆలోచన అవసరం లేదని షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ పెద్దలు కలుగజేసుకొని సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేసి ఇరువురిని వారించారు. ఓనర్ల మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలను తీసుకోలేదని బిసిసిఐ అధికారులు వెల్లడించారు. కేవలం అభిప్రాయాలను తెలుసుకోవడానికి మాత్రమే నిర్వహించిన సమావేశంగా బీసీసీఐకి చెందిన ఒక ఉన్నత అధికారి వెల్లడించారు.
మెగా ఆప్షన్ వద్దన్న షారుఖ్ ఖాన్, కావ్య మారన్
సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ఒకే మాట మీద ఉన్నారు. మెగా వేలం వద్దన్నా అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయగా.. దానికి కావ్య మారం నుంచి మద్దతు లభించింది. ఈ సమావేశంలో మాట్లాడిన షారుఖ్ ఖాన్ మెగా వేలం నిర్వహిస్తే ఐపిఎల్ గెలిచిన తమ జట్టులోని కొందరు సభ్యులను వదులుకోవాల్సి వస్తుందని, అది తమకు ఇబ్బందిగా మారుతుందని వెల్లడించారు. టోర్నీ గెలిచిన జట్టులోని సభ్యులను మార్చాల్సి వచ్చినప్పుడు వారికి ఏం చెప్పాలో కూడా తెలియదని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే విజయం సాధించినప్పుడు ఎవరిని తొలగించాలన్నది కూడా తమకు సమస్యగా మారుతుందని స్పష్టం చేశారు. కాబట్టి మెగా వేలం వద్దని వెల్లడించారు. ఇదే ప్రతిపాదనకు హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. వీరిద్దరూ మెగా ఆక్షన్ కు బదులుగా మినీ ఆక్షన్ పెట్టాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారని చెబుతున్నారు. దీనిపై పంజాబ్ జట్టు యజమాని నెస్ వాడియా మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ మెగా ఆప్షన్ నిర్వహించాలని పట్టుబట్టారు.
కావ్య మారన్ చెప్పిన మాట ఏమిటంటే
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ఈ సమావేశంలో కీలక ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఐపిఎల్ కోసం మెగా ఆక్షన్ కు బదులుగా మినీ ఆక్షన్ పెట్టాలని సూచించారు. దీనికి ఆమె ఒక కారణాన్ని చెప్పారు. మెగా ఆక్షన్ పెడితే జట్టులోని సభ్యులు అందరినీ మార్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. రిటెన్షన్ ప్లేయర్ ఆపర్చునిటీ చాలా తక్కువగా ఉంటుందన్నారు. కాబట్టి కీలక ఆటగాళ్లను కోల్పోతామని వెల్లడించారు. దీనికి ఉదాహరణగా ఓనర్ల మీటింగ్ లో అభిషేక్ శర్మ గురించి ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. మూడేళ్లపాటు వరుసగా అవకాశాలు కల్పిస్తే ఈ ఏడాది ఐపీఎల్ లో అభిషేక్ శర్మ అనే స్టార్ బయట ప్రపంచానికి కనిపించాడని, ఇప్పుడు మెగా ఆప్షన్ పెడితే మూడేళ్ల తమ కష్టం వృధా అయిపోతుందని వెల్లడించారు.
హాజరైన 10 జట్ల యజమానులు.. గవర్నింగ్ కౌన్సిల్ కు వివరాలు
బీసీసీఐ నిర్వహించిన ఈ సమావేశానికి ఐపీఎల్ లోని 10 జట్లకు సంబంధించిన యజమానులు హాజరయ్యారు. యజమానులు వెల్లడించిన అభిప్రాయాలను టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ కు పంపిస్తామని బీసీసీఐ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, ఇంపాక్ట్ రూల్ తో పాటు ఇతర అంశాలపైన లోతుగా చర్చించారు. ఆయా జట్ల యజమానులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను బీసీసీఐ ఉన్నతాధికారులు నమోదు చేసుకున్నారు. ఈ వివరాలను టోర్నమెంట్ గవర్నమెంట్ కౌన్సిల్ కు పంపిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.