Sanju Samson for CSK: సీఎస్కేలోకి సంజూ శాంసన్.. రాజస్తాన్‌కు జడేజాతో పాటు మరో ప్లేయర్.. ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
IPL 2026 Big Update | సంజు శాంసన్, రవీంద్ర జడేజాలు ఫ్రాంచైజీలు మారుతున్నారని ప్రచారం జరుగుతోంది. శాంసన్ కోసం చెన్నై ఇద్దరు ఆటగాళ్లను రాజస్థాన్‌కు పంపవచ్చు.

సంజూ శాంసన్ ఐపీఎల్ ట్రేడ్ వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. సంజూ శాంసన్ IPL 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ESPNcricinfo నివేదిక ప్రకారం, సంజు శాంసన్ స్థానంలో CSK రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్ రూపంలో లాంటి ఇద్దరు ఆల్ రౌండర్లను RRతో ట్రేడ్ చేయవచ్చు. ఈ ట్రేడ్ విజయవంతమైతే, జడేజా 17 సంవత్సరాల తర్వాత జడ్డూ తిరిగి RR జట్టులోకి వస్తాడు.
ESPNcricinfo ప్రకారం, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు అధికారులు రవీంద్ర జడేజా, సంజూ శాంసన్, సామ్ కరన్‌లతో కూడా ఈ విషయంపై మాట్లాడారు. ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది, అయితే ఏ ఫ్రాంచైజీ కూడా ట్రేడ్‌పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ ట్రేడ్‌ను అధికారికంగా చేయాలనుకుంటే, వారు ముగ్గురు ఆటగాళ్ల గురించి IPL గవర్నింగ్ కౌన్సిల్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ట్రేడింగ్ నిబంధనల ప్రకారం, ఆటగాళ్ల నుంచి మొదట లిఖితపూర్వక సమ్మతి వచ్చిన తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ తుది ఒప్పంద ప్రక్రియను కొనసాగిస్తుంది.
సంజూ శాంసన్, జడేజా చాలా కాలంగా రాజస్థాన్ రాయల్స్, CSKతో అనుబంధం కలిగి ఉన్నారు. శాంసన్ రాజస్థాన్ జట్టుతో 11 సంవత్సరాలు గడిపాడు. అయితే జడేజా 12 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తాను రాజస్థాన్ రాయల్స్ జట్టును వదిలి వెళ్లాలని భావిస్తున్నట్లు సంజూ శాంసన్ ఇదివరకే స్పష్టం చేశాడు.
జడేజా తన IPL కెరీర్‌లో 254 మ్యాచ్‌లు ఆడాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో విరాట్ కోహ్లీ, MS ధోని, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్‌ల తరువాత జడ్డూ ఉన్నాడు. CSK తరఫున ఆడుతూ జడేజా 143 వికెట్లు తీశాడు, ఇది అత్యధికం. IPL 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను కెప్టెన్‌గా కూడా నియమించింది. కానీ ఆ సీజన్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా జడేజా కెప్టెన్సీని ధోనికి తిరిగి ఇచ్చాడు. జడేజా రిక్వెస్ట్ మేరకు మహీ మళ్లీ కెప్టెన్ అయ్యి జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. చివరి రెండు బంతులు సిక్స్, ఫోర్ గా మలిచి జడేజా సీఎస్కేను విజేతగా నిలపడాన్ని అభిమానులు మరిచిపోలేరు.





















