(Source: Poll of Polls)
RR Vs RCB: 59కే కుప్పకూలిన రాజస్తాన్ రాయల్స్ - బెంగళూరు భారీ విజయం - ప్లేఆఫ్స్ ఆశలు సజీవం!
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 112 పరుగులకే కుప్పకూలింది.
Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఐపీఎల్ 2023లో బెంగళూరుకు భారీ విజయం లభించింది. రాజస్తాన్ రాయల్స్‌పై 112 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. కాగా రాజస్తాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2009 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే రాజస్తాన్ రాయల్స్ 58 పరుగులకు ఆలౌట్ అయింది.
రాజస్తాన్ బ్యాటర్లలో కేవలం షిమ్రన్ హెట్‌మేయర్ మాత్రమే ఓ మోస్తరుగా రాణించాడు. అతని ఇన్నింగ్స్ తీసేస్తే రాజస్తాన్ స్కోరు 24 పరుగులు మాత్రమే. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డు ఫ్లెసిస్ (55: 44 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.
కుప్పకూలిన ఆర్ఆర్ ఆర్డర్
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ అత్యంత నిరాశాజనకంగా ప్రారంభం అయింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0: 2 బంతుల్లో), జోస్ బట్లర్ (0: 2 బంతుల్లో) ఇద్దరూ ఖాతా తెరవకుండా పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ సంజు శామ్సన్ (4: 5 బంతుల్లో, ఒక ఫోర్), దేవ్‌దత్ పడిక్కల్ (4: 4 బంతుల్లో, ఒక ఫోర్), జో రూట్ (10: 15 బంతుల్లో, ఒక ఫోర్) కూడా దారుణంగా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 28 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే ధ్రువ్ జురెల్ (1: 7 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఈ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 49 పరుగుల రికార్డు బద్దలవుతుందేమో అనిపించింది.
కానీ ఆ తర్వాత షిమ్రన్ హెట్‌మేయర్ (35: 19 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. దీంతో రాజస్తాన్ ఊపిరి పీల్చుకుంది. అయితే కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో వేన్ పార్నెల్ మూడు వికెట్లు తీశాడు. మైకేల్ బ్రేస్‌వెల్, కరణ్ శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన ఫాఫ్, మ్యాక్స్‌వెల్
అంతకుముందు టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ బెంగళూరుకు శుభారంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఈ దశలో వేగంగా ఆడే ప్రయత్నం చేసిన విరాట్ కోహ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి కేఎం ఆసిఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ చేతికి చిక్కాడు.
దీంతో మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్‌కు వన్ డౌన్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ జత కలిశాడు. వీరు భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ప్రాసెస్‌లోనే ఫాఫ్ డుప్లెసిస్ అర్థ శతకం కూడా పూర్తయింది. ఈ సీజన్‌లో డుప్లెసిస్‌కు ఇది ఏడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక మళ్లీ కేఎం ఆసిఫే బెంగళూరును దెబ్బ కొట్టాడు. ఫాఫ్‌ను అవుట్ చేసి రాజస్తాన్‌కు రెండో వికెట్ అందించాడు.
ఆ తర్వాత వచ్చిన లోమ్రోర్, దినేష్ కార్తీక్ విఫలం అయ్యారు. అర్థ సెంచరీ అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా అవుట్ అయ్యాడు. అయితే ఆఖర్లో అనుజ్ రావత్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు ఈ వికెట్‌పై మంచి స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ఆడం జంపా, కేఎం ఆసిఫ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. సందీప్ శర్మకు ఒక వికెట్ దక్కింది.