Kieron Pollard: పొలార్డ్‌కు ముం‘బై’ - షాకింగ్ అప్‌డేట్ ఇచ్చిన మాజీ భారత స్పిన్నర్!
ఈసారి ఐపీఎల్ కోసం కీరన్ పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేయబోదని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పారు.
ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్... టీ20 దిగ్గజం, విండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్‌ను ఐపీఎల్ మినీ వేలానికి ముందు విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది చాలా 'కష్టమైన నిర్ణయం' అని భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ 2009 IPL వేలంలో కీరన్ పొలార్డ్‌ను కొనుగోలు చేసింది. IPL 2022 మెగా వేలంలో రూ.6 కోట్లకు అతనిని రిటైన్ చేసుకుంది.
ఈ హార్డ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ ఈ ఫార్మాట్‌లోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా నిలిచాడు. ముంబై ఐదుసార్లు IPL విజేతలుగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2022 IPLలో పొలార్డ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. మునుపటి IPL సీజన్‌లో అతను మూడు గేమ్‌లకు బెంచ్‌లో ఉన్నాడు. ముంబై కూడా టేబుల్ బాటమ్‌తో టోర్నీని ముగించింది.
పొలార్డ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌లో అతని భవిష్యత్తు సందేహాస్పదంగా ఉంది. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసం ఒక జట్టును నిర్మించాలని నొక్కిచెప్పిన హర్భజన్ సింగ్ ఈ సారి జరగనున్న మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పాడు.
"కీరన్ పొలార్డ్‌ను విడుదల చేయడం ముంబై ఇండియన్స్‌కు చాలా కష్టమని నేను భావిస్తున్నాను. అతను చాలా సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడు. కానీ మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భాలు ఉన్నాయి. దానికి బహుశా ఇదే సమయం. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఒక జట్టును తయారు చేయండి. పొలార్డ్ సంవత్సరాలుగా చేసిన పనిని చేయగల వ్యక్తిని కనుగొనడానికి ప్రయత్నించండి" అని స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ అన్నారు.
"ముంబైలో టిమ్ డేవిడ్ ఉన్నాడు. అతను కూడా పొలార్డ్ లాగా ఆడగలడు. కామెరూన్ గ్రీన్ కూడా వేలంలో అందుబాటులో ఉన్నాడు.” అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. మొత్తం 10 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్లు 16వ సీజన్ (ఐపీఎల్ 2023) కోసం తాము విడుదల చేసుకున్న, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించడానికి నవంబర్ 15వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఇది మంగళవారంతో ముగుస్తుంది.
View this post on Instagram