MS Dhoni: తొలి ఐపీఎల్ ఎంతో ప్రత్యేకం, ఆ సవాల్‌ను అధిగమించా: ధోనీ
IPL 2024: తొలి సీజన్ నాటి సంగతులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 2008లో ఆడిన చెన్నై జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందన్న ఈ కెప్టెన్ కూల్... చాలామంది ఆల్‌రౌండర్లు అందులో ఉన్నారని అన్నాడు.
మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వేళ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ధోనీ ఐపీఎల్ తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు. తొలి సీజన్ నాటి సంగతులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 2008లో ఆడిన చెన్నై జట్టు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందన్న ఈ కెప్టెన్ కూల్... చాలామంది ఆల్‌రౌండర్లు అందులో ఉన్నారని అన్నాడు. మాథ్యూ హెడెన్, మైక్ హస్సీ, ముత్తయ్య మురళీధరన్, జాకోబ్ ఓరమ్ వంటి దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంచి వారి గురించి తెలుసుకోవడం ఓ సవాలే అని ధోనీ అన్నాడు. ఒక జట్టుకు నాయకత్వం వహించేటప్పుడు.. అందులో ప్రతీ ఆటగాడినీ పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్న ధోనీ.. ఆటగాడి గురించి తెలిసినప్పుడే అతడిలోని బలాలు, బలహీనతలను అంచనా వేయగలమని అప్పుడే జట్టును సరైన మార్గంలో నడిపించగలం. ఐపీఎల్ వల్లే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకునే అవకాశం లభించిందని.. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో తాను ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాదు. కానీ, ఐపీఎల్‌తో అది సాధ్యమైందని ధోనీ అన్నాడు.
ధోనీ పోస్ట్‌లో ఏముందంటే?
ఇండియన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌తో ధోనీ రిటైర్‌మెంట్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొత్త సీజన్-కొత్త పాత్ర కోసం వేచి ఉండలేను. చూస్తూ ఉండండని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో ధోనీ మరోసారి ఆటకు వీడ్కోలు పలకునున్నాడన్న వార్త హల్‌చల్ చేస్తోంది. ధోని కోచ్‌గా ఉంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ధోనీ కోచింగ్ చేస్తారని ఒకరు... కొత్త పాత్ర అంటే ఏమిటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.