Viral Video: మ్యాచ్ జరుగుతుంటే ఆర్చర్ చేసిన పనికి అవాక్కయిన క్రికెట్ ప్రేమికులు.. వీడియో వైరల్
ఆర్చర్ తనలోని ఫన్నీ యాంగిల్ ను మరోసారి చూపించాడు. ఇంటరెస్టింగ్ గా మ్యాచ్ జరుగుతున్నప్పుడు హాయిగా నిద్రపోయి కనిపించాడు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ మ్యాచ్ లో నిద్రపోయిన అనుభవం అర్చర్ కు ఉంది.

IPL 2025 Jofra Archer Sleep: రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ముల్లన్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నిద్ర పోతూ కనిపించాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డగౌట్ లో ఉన్న ఆర్చర్ నిద్రపోతూ కనిపించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అధికారిక బ్రాడ్ కాస్టర్ ఒక్కసారిగా కెమేరాను డగౌట్ వైపు చూపించగా, అక్కడ వాలు కుర్చీపై పడుకుని, మంచిగా దుప్పటి కప్పుకుని నిద్ర పోతూ కనిపించాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. క్రికెట్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తూ తమకు తోచిన కామెంట్లు చేస్తూ లైకులు, షేర్లు చేస్తున్నారు. ఇక ఆర్చర్ మైదానంలో నిద్ర పోవడం ఇదే తొలిసారి కాదు. గత ఫిబ్రవరి లో అహ్మదాబాద్ లో జరిగిన మూడో వన్టేలో కూడా ఆర్చర్ నిద్రపోయాడు. ఈ మ్యాచ్ లో రిజర్వ్ కే పరిమితం అవడంతో డగౌట్ కు ఒక వైపు ఒరిగి నిద్రపోతూ కనిపించాడు.
Jofra Archer be like...🤔🤔😥😥 #PBKSvsRR #RRvsPBKS#CSKvsDC pic.twitter.com/DNUaraJZ8d
— Raj Singh (@RajSingh5455) April 5, 2025
సత్తా చాటుతున్న ఆర్చర్..
ఇక ఈ మ్యాచ్ లో ఆర్చర్ సత్తా చాటాడు. ఆరంభంలో ఒక్క ఓవర్ లోనే రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్లను తీసి పంజాబ్ కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ప్రియాంశ్ ను ఔట్ చేసిన ఆర్చర్.. ఆ ఓవర్ చివరి బంతికి ప్రమాదకర శ్రేయస్ ను ఔట్ చేసి పంజాబ్ కు షాకిచ్చాడు. నిజానికి ఈ సీజన్ తొలి మ్యాచ్ లో తను ఘోరంగా విఫలమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగులు సమర్పించుకుని, టోర్నీలో అత్యంత చెత్త బౌలర్ గా నిలిచాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై వికెట్లేమీ తీయలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేయడంతోపాటు ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో కీలకమైన రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.
రాయల్స్ భారీ స్కోరు..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరును చేసింది. ఈ మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇక ఆరంభంలో యశస్వి జైస్వాల్ (67), సంజూ (38) తో సత్తా చాటారు. తొలి వికెట్ కు 89 పరుగులు సాధించారు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. రియాన్ పరాగ్ (43 నాటౌట్), షిమ్రాన్ హిట్ మెయర్ (20), ధ్రువ్ జురెల్ (13 నాటౌట్)లు బ్యాట్ ఝళిపించడంతో రాయల్స్ 200 పరుగుల మార్కును దాటింది. మిగతా బౌలర్లలో లోకి ఫెర్గుసన్ రెండు వికెట్లు తీశాడు.




















