CSK vs PBKS: ఆసక్తికరంగా సాగనున్న చెన్నై, పంజాబ్ పోరు - ఈ ఆటగాళ్ల మధ్య ఇంట్రస్టింగ్ బ్యాటిల్!
ఐపీఎల్‌లో నేడు జరగనున్న చెన్నై, పంజాబ్ మ్యాచ్‌లో ఈ ఆటగాళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
Chennai Super Kings vs Punjab Kings: ఐపీఎల్ 2023లో నేడు (ఏప్రిల్ 30వ తేదీ) చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి మరోసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని మహేంద్ర సింగ్ ధోని జట్టు కోరుకుంటోంది.
అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్‌కు వెళ్లాలనే ఆశను నిలుపుకోవాలనేది శిఖర్ ధావన్ జట్టు ఉద్దేశం. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. చెన్నై, పంజాబ్ జట్టులో టాలెంటెడ్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వీరి మధ్య మ్యాచ్ సమయంలో ఆసక్తికరమైన పోటీ కనిపిస్తుంది.
అర్ష్‌దీప్ సింగ్ Vs రుతురాజ్ గైక్వాడ్: చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఐపీఎల్‌లో పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 13 బంతుల్లో రుతురాజ్‌ను రెండుసార్లు ఔట్ చేశాడు.
కగిసో రబడ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబడపై చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రికార్డు అంత బాలేదు. రబడ నాలుగు మ్యాచ్‌ల్లో అతన్ని రెండుసార్లు అవుట్ చేశాడు.
పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లపై 194 పరుగులు చేశాడు. కానీ స్పిన్నర్లపై వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అతను స్పిన్ బౌలర్లపై 25.8 సగటుతో 123 పరుగులు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్‌పెన్సివ్ ఫాస్ట్ బౌలర్లు: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్లు పవర్‌ప్లే సమయంలో ఎక్స్‌పెన్సివ్‌గా మారారు. పవర్‌ప్లేలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఓవర్‌కు 10.1 పరుగులు వెచ్చించారు.
అత్యల్ప సగటు: ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు బాగా కష్టపడ్డారు. దీని కారణంగా వారి ఓపెనింగ్ వికెట్ సగటు ఇతర జట్లతో పోలిస్తే అత్యల్పంగా ఉంది. పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ వికెట్ సగటు 17.3గా ఉంది.
వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన చెన్నైకి రాజస్తాన్ రాయల్స్ షాకిచ్చింది. ఈనెల 27న జైపూర్ లో వాళ్ల సొంతగడ్డపై రాజస్తాన్.. చెన్నైని నిలువరించింది. దీంతో ఈ మ్యాచ్ తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. కానీ నేడు స్వంత గ్రౌండ్ (చెపాక్)లో జరుగబోయే మ్యాచ్ లో పుంజుకుని టాప్ -2 కు చేరుకోవాలని చూస్తున్నది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న ఈ సీజన్ లో ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ముఖ్యమే కాబట్టి చెపాక్ లో పంజాబ్ కు చెక్ పెట్టేందుకు ధోని సేన రంగం సిద్ధం చేసుకుంటున్నది.
ఆ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రహానే, శివమ్ దూబే లతో టాపార్డర్ పటిష్టంగానే ఉంది. మిడిలార్డర్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్న అంబటిరాయుడు విఫలమవుతుండటం చెన్నైని కలవరపరిచేదే. చివర్లో రవీంద్ర జడేజా, ధోని లు హిట్టింగ్ చేస్తే చెపాక్ లో భారీ స్కోరు పక్కా. బౌలింగ్ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, పతిరానలతో ధోని అద్భుతాలు చేయిస్తున్నాడు.