(Source: ECI/ABP News/ABP Majha)
PBKS Vs LSG Highlights: లక్నోకు ఆరో విజయం - బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన పంజాబ్
ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్‌ను 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులకు పరిమితం చేశారు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
తక్కువ స్కోరుకే పరిమితం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫాంలో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను (6: 11 బంతుల్లో, ఒక ఫోర్) రబడ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్ (46: 37 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), దీపక్ హుడా (34: 28 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు.
కీలక సమయంలో వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో లక్నో కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా (7: 7 బంతుల్లో, ఒక ఫోర్), మార్కస్ స్టోయినిస్ (1: 4 బంతుల్లో), ఆయుష్ బదోని (4: 4 బంతుల్లో), జేసన్ హోల్డర్‌లు (11: 8 బంతుల్లో, ఒక సిక్సర్) విఫలం అయ్యారు. దీంతో లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడకు నాలుగు వికెట్లు దక్కాయి. రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా... సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది.
అదరగొట్టిన లక్నో బౌలర్లు
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (25: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నంలో అవుట్ కాగా... శిఖర్ ధావన్ (5: 15 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. స్కోరు బోర్డు మీద 46 పరుగులు చేరేసరికి వీరిద్దరూ అవుటయ్యారు.
భానుక రాజపక్స కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆ తర్వాత లక్నో ఏ సమయంలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. జానీ బెయిర్‌స్టో (32: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు), లియాం లివింగ్‌స్టోన్ (18: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు), రిషి ధావన్ (21: 22 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా... దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టాడు.