KKR Vs SRH: ఆరెంజ్ ఆర్మీపై సిక్సర్ల బుల్లెట్లు - చెలరేగిన రసెల్ - రైజర్స్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేసింది. ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగిపోయాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్న కోల్‌కతాకు ఆశించిన ఆరంభం లభించలేదు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) బంతిని వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 17 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ అజింక్య రహానే (28: 24 బంతుల్లో, మూడు సిక్సర్లు), నితీష్ రాణా (26: 19 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగిపోయారు. దీంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.
ఈ జోడి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాక ఉమ్రాన్ మాలిక్ వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ తర్వాతి ఓవర్లో శ్రేయస్ అయ్యర్‌ను (15: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ చేయడంతో కోల్‌కతా 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫాంలో ఉన్న రింకూ సింగ్‌ను (5: 6 బంతుల్లో) నటరాజన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఈ దశలో ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), శామ్ బిల్లింగ్స్ (34: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. భువీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి బిల్లింగ్స్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో ఆండ్రీ రసెల్ మూడు సిక్సర్లతో బాదడంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి.
రాజన్ తలో వికెట్ దక్కించుకున్నారు.