IPL 2023: ఆటగాళ్లను కోటీశ్వరులను చేసిన ఐపీఎల్ - లిస్ట్‌లో ఎవరు టాపో తెలుసా?
మొత్తం ఐపీఎల్‌లో కోటీశ్వరులు అయిన ఆటగాళ్లు వీరే.
IPL 2023 Rohit Sharma MS Dhoni Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి అన్ని జట్లూ సన్నద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.
ఐపీఎల్ కారణంగా చాలా మంది ఆటగాళ్ల కెరీర్ మెరుగుపడింది. తాలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అదే సమయంలో చాలా మంది ఆటగాళ్ళు ఏకంగా కోటీశ్వరులు అయ్యారు. ఐపీఎల్‌లో అత్యధికంగా డబ్బు సంపాదించిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 227 మ్యాచ్‌లు ఆడి 5,879 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ, 40 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీ నుంచి అత్యధికంగా ఆర్జించిన ఆటగాళ్ల గురించి మాట్లాడాలంటే ఆ లిస్ట్‌లో రోహిత్ అగ్రస్థానంలో ఉంటాడు. మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం రోహిత్ శర్మ ఐపీఎల్ నుండి దాదాపు రూ. 178 కోట్లు సంపాదించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంపాదనలో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ ద్వారా మహేంద్రుడు రూ. 176 కోట్లు సంపాదించాడు. ఐపీఎల్ తొలి వేలంలో ధోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తొలి వేతనంగా రూ. 6 కోట్లు అందుకున్నాడు. 2011లో ఈ మొత్తం రూ. 8.28 కోట్లకు చేరగా, ఇప్పుడు 2023లో అతని జీతం రూ. 12 కోట్లకు చేరుకుంది. ధోనీ కెరీర్‌ను పరిశీలిస్తే, 234 మ్యాచ్‌లు ఆడి 4,978 పరుగులు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 223 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను ఐదు సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో కోహ్లీ 6624 పరుగులు చేశాడు. సంపాదన విషయంలో విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లి రూ. 173 కోట్లు సంపాదించాడు. ఈ లీగ్‌లో కోహ్లీ ఇప్పటివరకు 218 సిక్సర్లు, 578 ఫోర్లు బాదాడు. అతని అత్యుత్తమ IPL స్కోరు 113 పరుగులుగా ఉంది.
ఐపీఎల్ 2023 తర్వాత మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుండి రిటైర్ అవుతారా? ఈ ఐపీఎల్ మహేంద్ర సింగ్ ధోనీకి చివరి సీజన్ కానుందా? ఇలాంటి ప్రశ్నలు ఈ సీజన్‌లోనే కాకుండా గత అనేక ఐపీఎల్ సీజన్‌ల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ధోనీ ప్రతి సంవత్సరం వాటన్నింటినీ మార్చేస్తూ ఉంటాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు ధోని గురించి ఈ ప్రశ్న ఎదురైంది. విలేకరుల సమావేశంలో రోహిత్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
IPL 2023 సీజన్ మార్చి 31వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో వీక్షకులు తమ అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని మైదానంలో చూస్తారు. దీని గురించి రోహిత్ శర్మను విలేకరుల సమావేశంలో అడిగారు. ‘మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2023 తర్వాత రిటైర్ అవుతారా?’ అనే ప్రశ్న రోహిత్‌కు ఎదురైంది.
ఈ ప్రశ్న విన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రీ-ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కాస్త ఇబ్బందికరమైన స్వరంతో, "ఈ సీజన్ మహేంద్ర సింగ్ ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందని నేను గత 2-3 సంవత్సరాలుగా వింటున్నాను. అతను ఇంకా ఫిట్‌గా ఉన్నాడని నేను భావిస్తున్నాను. మరికొన్ని సీజన్లు ఆడటానికి తన ఫిట్‌నెస్ సరిపోతుంది." అని సమాధానం ఇచ్చాడు.