IPL 2021: ముంబయి.. ప్లీజ్ ఓడిపోవా! ప్లేఆఫ్స్ కోసం పంజాబ్, కోల్‌కతా కోరికలు!
చివరి దశకు చేరుకోవడంతో ఐపీఎల్ మరింత ఆసక్తిగా మారింది. నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతోంది. మున్ముందు మ్యాచుల్లో ముంబయి ఓడిపోవాలని పంజాబ్, కోల్‌కతా కోరుకుంటున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి దశకు చేరుకుంది. మ్యాచులు ముగిసే కొద్దీ ఆసక్తి, ఉత్కంఠ పెరుగుతున్నాయి. ఒకరి గెలుపు మరొకరికి చేటుగా మారుతోంది! తాము ప్లేఆఫ్స్ చేరుకొనేందుకు మరో జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చాలా జట్లు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఓడిపోవాలని కోరుకుంటున్నాయి. ఎందుకో తెలుసా?
Also Read: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..
చెన్నై, దిల్లీ బిందాస్
గతేడాది చెత్త ప్రదర్శన చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ ఈ సారి మాత్రం బిందాస్‌గా ప్లేఆఫ్స్ చేరుకుంది. ఇంక వారికి గెలుపోటములతో పన్లేదు. దిల్లీ క్యాపిటల్స్ సైతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మున్ముందు జరిగే మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే చాలు. కనీసం రెండు గెలిచి అగ్రస్థానంలో నిలవాలని రిషభ్ సేన పట్టుదలతో ఉంది. 14 పాయిట్లతో ఉన్న బెంగళూరు కనీసం రెండు గెలిస్తే మేలు. పంజాబ్, దిల్లీ, హైదరాబాద్‌తో మ్యాచుల్లో అదరగొట్టాలి. కేవలం ఒకరి పైనే గెలిస్తే టాప్-2లో ఉండరు. అలాంటప్పుడు ఎలిమినేటర్లో ఓడితే కప్పు కొట్టలేరు. అయితే చెన్నై, దిల్లీ, బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుకోవడంలో ఇప్పటికైతే ఎవరికీ సందేహాల్లేవు!
Also Read: 'హిట్ మ్యాన్' సేనకు ఇక చావోరేవో! దిల్లీని ఓడించకపోతే ప్లేఆఫ్స్‌కు కష్టమే!
4 కోసం 3 పోటీ
ప్లేఆఫ్స్‌కు ఎంపికయ్యే నాలుగో జట్టుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి, కోల్‌కతా, పంజాబ్ ఆ స్థానం కోసం పోటీపడుతున్నాయి. కేకేఆర్, పంజాబ్ తలో 12 మ్యాచులాడి ఐదు గెలిచి 10 పాయింట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. 11 మ్యాచుల్లో 5 గెలిచిన ముంబయి నెట్‌రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఆరో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ చేరుకొనేందుకు రోహిత్ సేనకే ఎక్కువ అవకాశాలు ఉన్నా.. వాళ్లు ఓడిపోవాలని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు.
Also Watch: ముందుకెళ్లాలంటే గెలవాల్సిందే.. ముంబై ఇండియన్స్‌కు నేడు పెద్ద సవాల్
ముంబయి ఓడాలని..!
కేకేఆర్ తర్వాతి రెండు మ్యాచుల్లో రాజస్థాన్, హైదరాబాద్‌తో తలపడుతోంది. ప్రత్యర్థులకు ప్లేఆఫ్స్ అవకాశం ఎలాగూ లేదు. కానీ పరువు కోసం మెరుగ్గా ఆడే ప్రయత్నం చేస్తాయి. అందుకే వీరిలో ఏ ఒక్కరి చేతిలో ఓడినా మోర్గాన్ సేన ఇంటికెళ్లక తప్పదు! కేకేఆర్‌తో పోలిస్తే పంజాబ్ పరిస్థితి మరింత ఘోరం! మిగతా రెండు మ్యాచుల్లో వారు బెంగళూరు, చెన్నైను ఎదుర్కోవాలి. వారితో పోరు అంత సులభమేం కాదు. ఆ రెండింట్లో గెలిస్తే రాహుల్ సేన ప్లేఆఫ్స్‌కు చేరుకొనేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ ఒక్కటి ఓడినా ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే దిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ముంబయిని ఓడించాలని పంజాబ్, కోల్‌కతా కోరుకుంటున్నాయి. మరి ఈ పది రోజుల్లో ఏం జరుగుతోందో చూడాల్సిందే!!