Rohit Sharma: 2023లో అద్భుతమైన ఫాంలో రోహిత్ శర్మ - రెండు నెలల్లోనే 500 క్రాస్!
2023లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు.

Rohit Sharma Stats in 2023: భారత జట్టు 2023లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా టీమ్ ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. 2023లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుతమైన రిథమ్‌తో కనిపించింది.
ఇప్పటి వరకు టీ20 ఇంటర్నేషనల్, వన్డే, టెస్టు సిరీస్‌లు ఏవీ ఓడిపోలేదు. ఈ సిరీస్‌లన్నింటిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2023లో ఇప్పటివరకు రోహిత్ శర్మ మొత్తం రెండు సెంచరీలు చేశాడు.
2023లో రోహిత్ శర్మ గణాంకాలు
ఈ ఏడాది భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 56.77 సగటుతో మొత్తం 511 పరుగులు జోడించాడు. ఇందులో అతను రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. 2023లో ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున అత్యధికంగా పరుగులు చేయడంలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా లేటెస్ట్ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ 769 పరుగులతో నంబర్ వన్‌గా ఉన్నాడు.
రోహిత్ శర్మ 2023లో ఇప్పటివరకు మొత్తం రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 61 సగటుతో 183 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇది కాకుండా ఈ సంవత్సరం ఇప్పటివరకు వన్డేల్లో అతను 54.66 సగటుతో 328 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు టీమిండియా తరుపున మొత్తం 47 టెస్టులు, 241 వన్డేలు, 148 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 47.76 సగటుతో 3320 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను వన్డేలలో 48.91 సగటుతో 9,782 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో 31.32 సగటు, 139.24 స్ట్రైక్ రేట్‌తో 3853 పరుగులు చేశాడు.
మరోవైపు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ గంగూలి, కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలపై నోరు విప్పారు. గంగూలీ, కోహ్లీకి అసలు పడదని తెలిపారు. తనను కెప్టెన్‌గా తప్పించడంలో ఆయన పాత్ర చాలా ఉందని భావించిన కోహ్లీ... ఆ పేరు వింటేనే మండిపడతారన్నారు. ఓ సెలెక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్‌పై పునరాలోచించాలని గంగూలి చెప్పి ఉంటాడని.. అందుకు కోహ్లీ కుదరదని చెప్పి ఉంటారని చేతన్ తెలిపారు. తనను తప్పించడంపై కోహ్లీ ఓ ప్రెస్‌మీట్ పెట్టాలని భావించినప్పటికీ ఎందుకో ఆ పని చేయలేదన్నారు. అయినా... తనను గంటన్నర ముందే కెప్టెన్సీ నుంచి తప్పించారని 2021 దక్షిణాఫ్రికా పర్యటనలో చెప్పిన సంగతి గుర్తు చేశారు. మొదటి నుంచి కోహ్లీ తీరు గంగూలీకి నచ్చదని... సమయం కోసం చూసిన దాదా... రోహిత్ శర్మకు ఓటు వేశారన్నారు.
రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య ఇగో క్లాష్ ఉందన్నారు చేతన్ శర్మ. ఒకరు రోహిత్ అమితాబ్, కోహ్లీ ధర్మేంద్రలా ఫీల్ అవుతారన్నారు. జట్టులో విరాట్, రోహిత్ వర్గాలు ఉండేవన్నారు. కోహ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం రోహిత్ అండగా ఉన్నాడని వివరించారు. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే విరాట్, రోహిత్ నుంచి టీ 20 ఫార్మాట్ నుంచి తప్పించినట్టు తెలిపారు చేతన్ శర్మ. ఇక భవిష్యత్‌లో కూడా వీళ్లకు అవకాశాలు రాకోపవచ్చని కూడా కుండబద్దలు కొట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

