IND vs IRE 1st T20: ఐపీఎల్ స్టార్లు, ఐర్లాండ్‌కు యుద్ధం! గెలుపెవరిదో నేడు చూసేద్దాం!!
India vs Ireland: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ప్రయోగాల్లో రెండో సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. తనదైన పోరాటాలతో ఆకట్టుకొనే ఐర్లాండ్‌తో నేడు తొలి టీ20 ఆడనుంది.
IND vs IRE 1st T20: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ప్రయోగాల్లో రెండో సిరీసుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. తనదైన పోరాటాలతో ఆకట్టుకొనే ఐర్లాండ్‌తో నేడు తొలి టీ20 ఆడనుంది. డబ్లిన్‌లోని మలహైడ్ ఇందుకు వేదిక. దక్షిణాఫ్రికాతో సిరీసులో ఒక్క మార్పూ చేయని భారత్ ఈసారి భారీ ప్రయోగాలే చేయనుంది. మరి డబ్లిన్ పిచ్ ఎలా ఉండనుంది? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? కొత్త వాళ్లకు చోటు దక్కేనా?
ఐపీఎల్ స్టార్లే
ఐర్లాండ్‌లో అడుగుపెట్టిన తర్వాత టీమ్‌ఇండియా చాలా హుషారుగా కనిపించింది. అక్కడి వాతావరణం, పరిస్థితులను ఆస్వాదిస్తోంది. కుర్రాళ్లంతా మంచి జోష్‌లో కనిపించారు. తొలిసారి వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్ విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యకు ఈసారి సారథిగా ప్రమోషన్ వచ్చింది.
ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ రాకతో పోటీ మరింత పెరిగింది. పంత్ లేకపోవడంతో కీపింగ్ ఎవరుచేస్తారన్నది ఆసక్తికరం. సంజు, డీకే, ఇషాన్ మధ్య పోటీ నెలకొంది. బౌలింగ్ పరంగానూ టీమ్‌ఇండియాకు తిరుగులేదు. భువీ నేతృత్వంలో అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ దుమ్మురేపుతున్నారు. అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్‌లో ఒకరికి చోటు దక్కొచ్చు.
పోరాటంలో తిరుగులేదు
యూఏఈలో టీ20 ప్రపంచకప్ జరిగాక ఐర్లాండ్ పెద్ద జట్లతో సిరీసులు ఆడలేదు. అసోసియేట్ దేశాలతోనే తలపడింది. నమీబియా, అమెరికా, యూఏఈ చేతుల్లో ఓటమి పాలైంది. టీమ్‌ఇండియాతో తలపడటం వల్ల వారి క్రికెట్‌కు మేలు జరగనుంది. పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్‌బిర్ని, జార్జ్ డాక్రెల్ వంటి క్రికెటర్లు ఆసక్తి రేపుతున్నారు. క్రెయిగ్ యంగ్ మరో 2 వికెట్లు పడగొడితే టీ20ల్లో 50 వికెట్లు తీసిన ఐర్లాండ్ ఐదో బౌలర్‌గా నిలుస్తాడు. చిన్న జట్టే కదాని ప్రత్యర్థిని భారత్ తేలిగ్గా తీసుకోకూడదు. తమదైన రోజున వారు ఎవరినైనా ఓడించగలరు. వారిలో పోరాట పటిమకు తిరుగులేదు.
రన్ ఫెస్ట్
డబ్లింగ్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ పరుగుల వరద పారనుంది. చివరి ఐదు టీ20ల్లో తొలి ఇన్నింగ్స్ సగటు 180+గా ఉంది. అంతకన్నా ముందు జరిగిన మూడు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 200 మైలురాయిని దాటాయి. నెదర్లాండ్స్‌పై స్కాట్లాండ్ ఇక్కడే 252/3తో దుమ్మురేపింది. జార్జ్ మున్‌సె 2019లో 56 బంతుల్లోనే 127 పరుగులు చేశాడు. అంటే ఇషాన్ కిషన్ రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువే.
IND vs IRE Probable XI
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్‌బిర్ని, గారెత్ డిలానీ, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టార్, లార్కన్ టక్కర్, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్
భారత్ : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్
Captain @hardikpandya7 and Head Coach @VVSLaxman281 address the huddle on the eve of the first T20I against Ireland.#TeamIndia pic.twitter.com/aLVWAbVf53
— BCCI (@BCCI) June 25, 2022