Archery Golden Treble: విల్లు ఎక్కుపెట్టి క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఆర్చరీలో మూడు పసిడి పతకాలతో సరికొత్త చరిత్ర, షూటింగ్‌లో నీరు కైనాన్ జోడీకి గోల్డ్ మెడల్..8వ ప్లేస్ లోకి భారత్
ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చరీలో మూడు స్వర్ణాలు క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించిన భారత ఆర్చర్లు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటాను సైతం సొంతం చేసుకున్నారు.

Sensational Triple Gold Masterclass Powers India Historic Archery Dominance: ఆసియా క్రీడలు 2026లో 11వ రోజు భారత అథ్లెట్లు స్వర్ణాల పంట పండించారు. కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అందుబాటులో ఉన్న మొత్తం మూడు బంగారు పతకాలను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణం గెలుచుకోవడమే కాకుండా, దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసింది. అంతకుముందు సెమీస్‌లో కొరియాను 234-233తో భారత్ ఓడించింది. అనంతరం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో దక్షిణ కొరియాను చిత్తు చేసి రెండో పసిడిని ముద్దాడటంతో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ క్రీడలకు అధికారిక అర్హత సాధించింది. ఇక పురుషుల కాంపౌండ్ టీమ్ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను ఓడించి బంగారు పతకంతో హ్యాట్రిక్ స్వర్ణాల రికార్డును పూర్తి చేసింది.
షూటింగ్ రేంజ్‌లో నీరు కైనాన్ మాయాజాలం.. వరుసగా రెండో రోజు పసిడి
షాట్‌గన్ షూటింగ్ రేంజ్‌లో భారత్‌కు మరో చిరస్మరణీయ విజయం దక్కింది. ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో నీరు ధాండా, కైనాన్ చెనాయ్ జోడీ ఆరంభంలో లక్ష్యాలను చేజార్చుకున్నప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. తుది పోరులో ఖతార్‌ను కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. నీరు ధాండాకు వరుసగా రెండు రోజుల్లో ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.
రింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్ పంచ్ పవర్.. సెమీస్‌లో ఇద్దరికి కాంస్యాలు
బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ మహిళల 75 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసింది. కజకిస్తాన్‌కు చెందిన నటాల్యా బొగ్డనోవాపై 3-2తో ఉత్కంఠ విజయం సాధించింది. మహిళల 60 కేజీల సెమీఫైనల్లో ప్రియా గంగస్, పురుషుల 90 కేజీల బౌట్‌లో కపిల్ పోఖరియా ఓటమి పాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. రెజ్లింగ్‌లో సునీల్ కుమార్ పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.
స్క్వాష్ జట్లకు పతకాలు ఖాయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
స్క్వాష్ కోర్టులోనూ భారత జట్లు విజయకేతనం ఎగురవేశాయి. మహిళల జట్టు సింగపూర్‌ను 2-0తో ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టగా, తన్వి ఖన్నా, అనాహత్ సింగ్ అద్భుతంగా రాణించారు. పురుషుల జట్టు సైతం సెమీస్‌కు చేరుకోవడంతో స్క్వాష్‌లో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. కనోయ్ స్లాలొమ్‌లో ప్రద్యుమ్న సింగ్ రాథోడ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో అనిరుధ్ చంద్రశేఖర్, ఎన్ శ్రీరామ్ బాలాజీ ద్వయం క్వార్టర్స్‌లో చైనా జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Before You Go
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
ట్రెండింగ్ వార్తలు






















