Mirabai Chanu: మోదీజీ, మణిపూర్‌ను కాపాడండి - ప్రధానికి ఒలింపిక్స్ మెడలిస్ట్ మీరాబాయి వినతి
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది.
Mirabai Chanu: సుమారు మూడు నెలలుగా ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను ఆదుకోవాలని, ఇకనైనా తమ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ప్రముఖ వెయిట్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కోరింది. సోమవారం ఆమె తన ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ.. మూడు నెలలుగా మణిపూర్‌లో ఘర్షణల్లో కాలిపోతున్నదని, ఇకనైనా తమను ఆదుకోవాలని కోరింది.
ట్విటర్ వేదికగా చాను స్పందిస్తూ... ‘మణిపూర్‌లో అల్లర్లు మొదలై మూడు నెలలు కావొస్తుంది. ఇప్పటికీ కూడా అక్కడ శాంతి లేదు. ఈ అల్లర్ల వల్ల రాష్ట్రంలోని చాలామంది క్రీడాకారులు ట్రైనింగ్ సెషన్స్‌కు హాజరుకాలేకపోతున్నారు. విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. చాలామంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఇళ్లు కాలిపోయాయి...
మణిపూర్ నా స్వరాష్ట్రం. నేను ప్రస్తుతం మణిపూర్‌లో లేనప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలు నన్ను కలిచివేస్తున్నాయి. ఈ అల్లర్లకు ముగింపు ఎప్పుడు పడుతుందోనని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఈ అంశంపై దృష్టిసారించి ఇకనైనా అక్కడ శాంతి స్థాపనకు కృషి చేయాలని నేను వేడుకుంటున్నా. మణిపూర్ ప్రజలను కాపాడండి..’అని ఆమె వీడియోలో తెలిపింది.
I request Hon'ble Prime Minister @narendramodi_in sir and Home Minister @AmitShah sir to kindly help and save our state Manipur. 🙏🙏 pic.twitter.com/zRbltnjKl8
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 17, 2023
త్వరలో జరుగబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా క్రీడల్లో రాణించేందుకు గాను మీరాబాయి చాను ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ పొందుతోంది. మీరాబాయి ట్వీట్‌తో మణిపూర్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
చాను కంటే ముందు భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు, టీమిండియాలో మిడ్ ఫీల్డర్‌గా ఉన్న జాక్సన్ సింగ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇటీవలే శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్‌లో కువైట్ పై గెలిచిన తర్వాత అతడు మాట్లాడుతూ.. మణిపూర్ ప్రజలు అల్లర్లను వీడి శాంతిని నెలకొల్పాలని కోరాడు. మాజీ వరల్డ్ ఛాంపియన్, దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కూడా ఈ అల్లర్లపై గతంలోనే ట్వీట్ చేసింది. ‘నా మణిపూర్ తగలబడిపోతోంది. దయచేసి న్యాయం చేయండి’ అంటూ నరేంద్ర మోడీ, అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కోరింది.
కాగా.. మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య మే నుంచి ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. మైతేయిలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం.. షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా ఇవ్వడంతో గిరిజన తెగ అయిన కుకీలలో ఈ నిర్ణయం ఆగ్రహాన్ని తెప్పించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకూ ఏ ప్రకటనా చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial