IND Vs SL: ఆఖరి ఓవర్లలో శ్రీలంక విధ్వంసం - భారత్ ముందు భారీ లక్ష్యం!
టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది.
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక (56 నాటౌట్: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌కు వికెట్లు దక్కాయి. టీమిండియా విజయానికి 120 బంతుల్లో 207 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ శ్రీలంకకు ఓపెనర్లు పతుం నిశ్శంక (33: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కుశాల్ మెండిస్ (52: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) శుభారంభం అందించారు. నిశ్శంక నిదానంగా ఆడినా, కుశాల్ మెండిస్ మాత్రం చెలరేగిపోయాడు. పిచ్ మొదట్లో పేసర్లకు కూడా అనుకూలించలేదు. దీంతో శ్రీలంక మొదటి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు సాధించింది. ఈ దశలో శ్రీలంక 200 పరుగులు చేస్తుందనిపించింది.
కానీ స్పిన్నర్ల ఎంట్రీతో శ్రీలంక స్కోరు బోర్డు మారిపోయింది. కుశాల్ మెండిస్‌ను అవుట్ చేసి యుజ్వేంద్ర చాహల్ భారత్‌కు మొదటి వికెట్ అందించారు. ఆ తర్వాత భానుక రాజపక్సను (2: 3 బంతుల్లో) ఉమ్రాన్ మాలిక్, మరో ఓపెనర్ పతుం నిశ్శంకను అక్షర్ పటేల్ అవుట్ చేశారు. దీంతో శ్రీలంక 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. స్కోరు మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులకు చేరుకుంది.
ఆ తర్వాత చరిత్ అసలంక (37: 19 బంతుల్లో, నాలుగు సిక్సర్లు), కెప్టెన్ దసున్ షనక (56 నాటౌట్: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లు) రాణించారు. మధ్య ఓవర్లలో అసలంక, చివరి ఓవర్లలో షనక సిక్సర్లతో చెలరేగి ఆడారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ రెండు, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీశారు. శ్రీలంక చివరి ఐదు ఓవర్లలో 77 పరుగులు సాధించడం విశేషం.
'
View this post on Instagram