IND vs SA T20 Series: రాహుల్ + రాహుల్ = 3 తలనొప్పులు!
IND vs SA T20 Series: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా రెడీ అవుతోంది. సిరీసుకు ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మూడు కీలక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
IND vs SA T20 Series: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసుకు టీమ్‌ఇండియా రెడీ అవుతోంది. ఆటగాళ్లంతా ఒక్క చోటకు చేరుకుంటున్నారు. సిరీసుకు ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul), కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు (Rahul Dravid) మూడు కీలక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి వీటికి పరిష్కారాలు ఎలా వెతుకుతారో చూడాలి.
ఈ సిరీసులో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి సహా మరికొందరికి విశ్రాంతి ఇచ్చారు. ఐపీఎల్ 2022లో రాణించిన కుర్రాళ్లకు ఎక్కువ ఛాన్స్‌లు ఇచ్చారు. దాంతో తుది జట్టు ఎంపిక, కూర్పు తలనొప్పులు తెప్పిస్తోంది. హర్దిక్ పాండ్యను ఎక్కడ ఆడించాలో అర్థమవ్వడం లేదు.
ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్య (Hardik Pandya) అదరగొట్టాడు. 16 మ్యాచుల్లో 487 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించాడు. అటు బంతితోనూ దుమ్మురేపాడు. అయితే ఈ సీజన్ మొత్తం అతడు నాలుగో స్థానంలోనే ఆడాడు. సాధారణంగా టీమ్‌ఇండియాలో పాండ్య ఫినిషర్ రోల్ పోషించేవాడు. అవసరాన్ని బట్టి 6,7, 8 స్థానాల్లో దించేవారు. కానీ తనకిష్టమైంది నాలుగో స్థానమేనని పాండ్య స్పష్టం చేశాడు. మాటకు తగట్టు ఆటలోనూ రాణించి చూపించాడు. ఈ నేపథ్యంలో అతడిని ఎక్కడ ఆడించాలన్నది సమస్యగా మారింది. మ్యాచ్ ఫినిషర్ పాత్రలో డీకే రాణిస్తుండటంతో 4, 5 స్థానాల్లో ఆడిస్తుండొచ్చు.
కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఓపెనింగ్ భాగస్వామిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది మరో సమస్య! సెలక్షన్ కమిటీ ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది. వీరిద్దరూ ఐపీఎల్‌లో అంచనాల మేరకు ఆడలేదు. రుతురాజ్ ఒకట్రెండు మ్యాచుల్లో మాత్రమే భారీ పరుగులు చేశాడు. కిషన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు రుతురాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతడితో ప్రయోగం చేస్తారేమో చూడాలి.
బౌలింగ్ పరంగానూ చిక్కొచ్చి పడింది. స్పిన్నర్లు, పేసర్లు ఎక్కువ మందే ఉన్నారు. కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లో ఏ ఇద్దరిని తీసుకుంటారో తెలియదు. బహుశా కుల్చా కాంబినేషన్‌ను మళ్లీ తెరపైకి తెస్తారేమో! జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కుతుందా చూడాలి! ఐపీఎల్‌లో భువనేశ్వర్, అర్షదీప్ పరుగుల్ని నియంత్రించారు కానీ ఎక్కువ వికెట్లు తీయలేదు. అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ వికెట్లు తీశారు కానీ అప్పుడప్పుడు ఎక్కువ పరుగులే ఇచ్చారు. అలాంటప్పుడు బౌలింగ్ కాంబినేషన్ సెట్ చేయడం కత్తిమీద సామే!
Also Read: ఐపీఎల్ మ్యాచులు 100కు పెంచుతున్నారా? దాదా, షా ఇంగ్లాండ్ టూర్ అందుకేనా!!