![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్! ఆసీస్ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ!
IND vs AUS, 1st T20, Mohali Cricket Stadium: మొహాలి టీ20లో భారీ స్కోరు చేసినప్పటికీ హిట్‌మ్యాన్ సేన ఈ మ్యాచులో పరాభవం ఎదుర్కొంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే!
![IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్! ఆసీస్ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ! IND vs AUS 1st T20 india mistakes against australia at Mohali Cricket Stadium IND vs AUS: మొదటి ప్రయోగం ఫెయిల్! ఆసీస్ టీ20లో టీమ్‌ఇండియా పొరపాట్లు ఇవీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/c81b4bcbd449e85d22d4d3c00f5056751663743119831251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs AUS, 1st T20: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట లోపాలను సరిదిద్దుకొనేందుకు టీమ్‌ఇండియాకు కొన్ని అవకాశాలే ఉన్నాయి. అందులో ఆస్ట్రేలియాలతో తొలి టీ20 ఒకటి. భారీ స్కోరు చేసినప్పటికీ హిట్‌మ్యాన్ సేన ఈ మ్యాచులో పరాభవం ఎదుర్కొంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే!
పిచ్ ఛేదనకు అనుకూలం
మొహాలి పిచ్ ఛేదనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించింది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం ఇక్కడ కష్టం. పిచ్ హార్డ్‌గా ఉంటుంది. అలాగే బౌన్స్ ఉంటుంది. ఫ్లాట్ పిచ్ కావడంతో వైవిధ్యం ప్రదర్శించేందుకు వీలుండదు. టీమ్‌ఇండియా ఓటమికి మొదటి కారణం ఇదే.
పేవలమైన బౌలింగ్
టీమ్‌ఇండియా బౌలింగ్ స్థాయికి తగినట్టు లేదు. ఈ ఏడాది టీ20ల్లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ దారుణంగా విఫలమయ్యాడు. 13 ఎకానమీతో 52 రన్స్ ఇచ్చాడు. రిస్ట్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 3.2 ఓవర్లలో ఒక వికెట్ తీసి 42 పరుగులు ఇచ్చాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చాడు. తమకు స్ట్రెంత్‌కు కాకుండా ప్రత్యర్థి స్ట్రెంత్‌కు తగ్గట్టు బంతులేశారు. అక్షర్ పటేల్ (3/17) గనక లేకుంటే ఆసీస్ 17-18 ఓవర్లకే గెలిచేది. బుమ్రా లేకపోవడం పెద్ద మైనస్. ఉమేశ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఫీల్డింగ్ దారుణం
ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ఫీల్డింగ్ దారుణంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ అలసత్వం అస్సలు పనికిరాదు. ఏకంగా 3 క్యాచులు నేలపాలు చేశారు. టాప్ స్కోరర్ కామెరాన్ గ్రీన్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ జారవిడిచాడు. స్టీవ్ స్మిత్ క్యాచ్‌ను కేఎల్ రాహుల్ వదిలేశాడు. మాథ్యూ వేడ్ క్యాచ్‌ను హర్షల్ పటేల్ అందుకోలేకపోయాడు. ఈ మూడు తప్పులు రోహిత్ సేనపై ఒత్తిడి పెంచాయి. అవతలి వారికి స్వేచ్ఛను ఇచ్చాయి.
డీకే మరీ రస్టీగా!
వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కదలికలు ఆత్మవిశ్వాసంగా కనిపించలేదు. డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో అతడి పాత్ర ఎక్కువగా ఉండాలి. కానీ రస్టీగా ఉన్నాడు. మొదట యూజీ బౌలింగ్‌లో కామెరాన్ గ్రీన్ ఎల్బీ అయ్యాడన్న సంగతిని అతడు గుర్తించనే లేదు. స్టీవ్‌స్మిత్, మాక్స్‌వెల్ క్యాచ్ ఔట్ల విషయంలోనూ యాక్టివ్‌గా లేడు. భువీ బౌలింగ్‌లో వికెట్ల దగ్గరగా నిలబడి తప్పుచేశాడు. కాస్త దూరంగా ఉండుంటే పవర్‌ప్లేలో వికెట్లు పడేవి.
నో మూమెంటమ్ షిప్ట్!
ఎప్పుడూ చేసే ప్రధానమైన తప్పు మళ్లీ జరిగింది! టీ20 అంతా మూమెంటమ్ గేమ్. మ్యాచులు గెలవాలంటే మొదట చిన్న చిన్న మూమెంట్స్‌ను గెలవాలి. పవర్‌ప్లేలో వికెట్లు తీయకపోవడం వల్ల ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పించారు. మిడిల్‌లో పరుగులు నియంత్రించలేదు. రన్‌రేట్ పెంచి ఒత్తిడి పెంచలేదు. అక్షర్ వికెట్లు తీసినా డెత్‌లో మిగతా వాళ్లు పేలవంగా బౌలింగ్ చేశారు. మాథ్యూవేడ్ సహజంగానే లెగ్‌సైడ్ దూకుడుగా ఆడతాడు. విచిత్రంగా అతడికి అటువైపే బంతులేశారు. అతడు మూమెంటమ్‌ను షిప్ట్ చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)