Nita Ambani: క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు డబ్ల్యూపీఎల్ స్పూర్తిని ఇస్తుంది: నీతా అంబానీ!
మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో నీతా అంబానీ సమక్షంలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
Nita Ambani: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో జట్టు యజమాని నీతా అంబానీ సమక్షంలో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శనను కనబరించింది. మార్చి 4వ తేదీన ఈ మ్యాచ్ జరిగింది. బంతితోనూ, బ్యాట్‌తోనూ మ్యాచ్‌లో నియంత్రణ కనబరిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ఏకంగా 143 పరుగులతో ఘనవిజయం సాధించిన టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించింది.
మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడానికి పురుషులు, స్త్రీలు పెద్ద సంఖ్యలో స్టేడియంకి వచ్చారు. మహిళలు మరింత ఎక్కువగా ఆటల్లో పాల్గొనాలన్నదే నీతా అంబానీ లక్ష్యం. మ్యాచ్ అనంతరం ముంబై ఎప్పుడూ జరుపుకునే డ్రెస్సింగ్ రూం సంబరాల్లో నీతా అంబానీ కూడా పాల్గొన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి రోజును ఎప్పటికీ మర్చిపోలేమని నీతా అంబానీ అన్నారు. ‘ఇది ఒక చారిత్రాత్మక రోజు. క్రీడా రంగంలో ఉన్న మహిళలకు చారిత్రాత్మక ఘట్టం. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగం కావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.’ అని నీతా అంబానీ అన్నారు. పూర్తి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూను ఇక్కడ వినండి.
క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు డబ్ల్యూపీఎల్ ఎంతగానే ఉపయోగపడనుందని నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఉన్న వాతావరణాన్ని ఎంతగానో కొనియాడారు. ‘క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే యువ క్రీడాకారిణులకు వారి కలలను నిజం చేసుకునేలా ఈ టోర్నమెంట్ వారిని ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నాను.’ అని నీతా అంబానీ అన్నారు.
ముంబై జట్టు:
ముంబై ఇండియన్స్ జట్టు పూర్తిగా స్టార్లతో నిండిపోయింది. అనుభవం ఉన్న క్రికెటర్లు, యువ క్రీడాకారిణులతో చాలా సమతుల్యమైన జట్టుతో తమ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. ‘భయం లేకుండా, ఆసక్తికరమైన క్రికెట్ ఆడటానికి ముంబై ఇండియన్స్ పెట్టింది పేరు. మా అమ్మాయిలు ఈరోజు అద్భుతంగా ఆడారు. వారు ఆడిన విధానానికి నాకు చాలా గర్వంగా ఉంది. అదొక గొప్ప ప్రదర్శన. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మా కెప్టెన్ హర్మన్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. అమేలియా కేర్ కూడా బాగా ఆడింది. తను బ్యాటింగ్, బౌలింగ్ రెండూ బాగా చేసింది.’ అని నీతా అంబానీ అన్నారు.
‘పాల్టన్’కు పొగడ్తలు
అలాగే ఈ మ్యాచ్‌కు తరలివచ్చిన ఫ్యాన్స్‌ను కూడా నీతా అంబానీ గుర్తు చేసుకున్నారు. ‘ఇంత మంది స్టేడియంకు రావడం అద్భుతంగా ఉంది. మహిళలు, పురుషులు భారీగా ఈ స్టేడియంకు హాజరై మహిళల జట్టుకు సపోర్ట్ చేశారు.’ అని నీతా అంబానీ తెలిపారు. దీంతోపాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆర్మీ ‘ఎంఐ పాల్టన్’కు ప్రత్యేకమైన మెసేజ్ ఇచ్చారు. ‘మన అమ్మాయిలకు మరింత సపోర్ట్ ఇద్దాం. వారింకి మరింత పవర్ చేకూరాలి. ఈ ప్రారంభ టోర్నమెంట్‌లో ఆడుతున్న అన్ని జట్లకు ఆల్ ది బెస్ట్.’ అన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముంబై తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.