Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!
Vinod Kambli Birthday: టీమిండియా తరఫున ఆడిన రోజుల్లోనూ సచిన్ కన్నా కాంబ్లీనే మెరుగైన రికార్డులు సాధించాడు. వీరి గురువు రమాకాంత్ ఆచ్రేకర్ సైతం సచిన్ కన్నా కాంబ్లీనే ఎక్కువగా నమ్మేవారట.
Happy Birthday Vinod Kambli: 1990 దశకంలో భారత క్రికెట్‌లో సంచలనాలుగా సచిన్ టెండూల్కర్, అతడి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఉన్నారు. కానీ భారత క్రికెట్ జట్టులోకి రాకముందే బెస్ట్ బ్యాటర్‌గా కాంబ్లీ నిలిచాడు. టీమిండియా తరఫున ఆడిన రోజుల్లోనూ సచిన్ కన్నా కాంబ్లీనే మెరుగైన రికార్డులు సాధించాడు. వీరి గురువు రమాకాంత్ ఆచ్రేకర్ సైతం సచిన్ కన్నా కాంబ్లీనే ఎక్కువగా నమ్మేవారట. కానీ అనూహ్యంగా కాంబ్లీ కెరీర్ తక్కువ సమయంలో ముగిసింది. నేడు వినోద్ కాంబ్లీ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
స్కూల్ నుంచే రికార్డుల జోరు:
ముంబై అంటే గుర్తుకొచ్చేది క్రికెట్. జాతీయ క్రికెట్ జట్టుకు ఎంతో మంది ఆటగాళ్లు మహారాష్ట్ర నుంచి సెలక్ట్ అయ్యావారు. సచిన్ లాగే వినోద్ కాంబ్లీకి కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్ రోజుల నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. శారదా విద్యాసారం స్కూల్ కోసం 1988లో ఓ మ్యాచ్‌లో సచిన్, కాంబ్లీ కలిసి 664 పరుగులు చేశారు. ఇందులో అధిక పరుగులు వినోద్ కాంబ్లీ (345 పరుగులు) చేశాడు. ఆ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇది మొదలు వీరి పేర్లు జాతీయ క్రికెట్ జట్టులో చర్చకు వచ్చాయి.
1992లో భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఆడే అవకాశం వినోద్ కాంబ్లీకి లభించింది. ముఖ్యంగా క్రికెట్ సిసలురూపమని భావించే టెస్టు క్రికెట్‌లో అతని ఆటతీరు అద్భుతం. ఎందుకంటే టెస్టుల్లో కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 టెస్ట్ పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా అతడి పేరట రికార్డ్ ఉంది.
సచిన్ తరువాత టీమిండియాకు సెలక్ట్ అయినా.. సచిన్ టెండూల్కర్ కంటే ముందే టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించాడు. జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 227 పరుగులు చేశాడు. వినోద్ కాంబ్లీ తన తొలి 8 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. కెరీర్‌లో 17 టెస్టులు ఆడి 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు కాంబ్లీ.
సచిన్, కాంబ్లీలే..
టీమిండియా కచ్చితంగా వరల్డ్ కప్ నెగ్గుతుందని భావించిన సందర్భమది. 1996 ప్రపంచకప్ పలు వివాదాలతో ముగిసింది. ముఖ్యంగా లంకతో మ్యాచ్ ఓటమి అనంతరం వినోద్ కాంబ్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించాడు. ఆ వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ కాకుండా సెంచరీ సాధించిన మరో క్రికెటర్ కాంబ్లీ కావడం విశేషం. ఆ ప్రపంచకప్‌లో జింబాబ్వేపై106 పరుగులతో శతకం చేశాడు. కాంబ్లీ చివరిసారిగా 2000లో శ్రీలంకతో వన్డే ఆడాడు. కెరీర్‌లో 104 వన్డేలాడిన కాంబ్లీ 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీల సాయంతో 2477 పరుగులు సాధించాడు.
చిన్న వయసులో జట్టుకు దూరం..
కేవలం 28 ఏళ్ల వయసులో వినోద్ కాంబ్లీ టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత రెండు సినిమా నిర్మాణ సంస్థలను ప్రారంభించి సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ముంబైలో ఈ లోక్‌భారతి పార్టీ ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. 2010లో మోడల్ ఆండ్రియా హెవిట్‌ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఆటపై అతడు ఫోకస్ చేసి ఉంటే కచ్చితంగా మళ్లీ టీమిండియాకు ఆడేవాడని మాజీ క్రికెటర్లు, కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ పలు సందర్భాలలో చెప్పేవారు.