World Cup 2023 NZ vs AFG: మరో సంచలనానికి ఆఫ్ఘనిస్తాన్ రెఢీ - అగ్రస్థానంపై కన్నేసిన న్యూజిలాండ్
World Cup 2023 NZ vs AFG: ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ తమ నెక్ట్స్ మ్యాచ్ లో పటిష్ట న్యూజిలాండ్ ను ఢీకొట్టబోతోంది.
World Cup 2023 New Zealand vs Afghanistan
చెన్నై: ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ తమ నెక్ట్స్ మ్యాచ్ లో పటిష్ట న్యూజిలాండ్ ను ఢీకొట్టబోతోంది. ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్ మరో విజయంపై ఫోకస్ చేస్తోంది. అక్టోబర్ 18న జరగనున్న మ్యాచ్ వరల్డ్ కప్ లో 16వ మ్యాచ్.. కాగా, చెన్నైలోని ఎంఏ చిదరంబంర స్టేడియం అఫ్గాన్, కివీస్ మ్యాచ్ కు వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, 3 మ్యాచ్ లకుగానూ ఒక్కటి నెగ్గిన అఫ్గాన్ 6వ స్థానంలో నిలిచింది. అఫ్గాన్ పై నెగ్గితే 8 పాయింట్లతో అగ్ర స్థానం కివీస్ దే.
వన్డే ప్రపంచకప్ విషయానికొస్తే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు రెండుసార్లు తలపడగా, 2 మ్యాచ్ ల్లోనూ కివీస్ విజయం సాధించి 2-0 తో పైచేయి సాధించింది. కానీ 2019 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్ ను ఓడించిన తరువాత అఫ్గాన్ జట్టును మరే జట్టు అంత తేలికగా తీసుకోవని చెప్పవచ్చు. అఫ్గాన్ చిన్నజట్టుగా కనిపించినా, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణిస్తూ పెద్ద జట్లను ఇబ్బంది పెడుతోంది.
విలియమన్సన్ లేకున్నా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ లతో కివీస్ బ్యాటింగ్ పటిష్టం, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీలతో బౌలింగ్ లోనూ మంచి ఫలితాలు రాబడుతున్నారు. అటు అఫ్గాన్ జట్టులో బౌలింగ్ లో మెరుపులు మెరిపిస్తూ అగ్రజట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. రషీద్, నబీ, ముజీబుర్ రెహ్మాన్ లాంటి బౌలర్లు వికెట్లతో రాణిస్తుండగా.. బ్యాటింగ్ లో గుర్బాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ..
గాయం కారణంగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ 4వ మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఇదివరకే మెగా టోర్నీలో తొలి 2 మ్యాచ్ లకు దూరమైన విలిమయ్సన్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో మరోసారి గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ (107 బంతుల్లో 78 రన్స్) తరువాత చేతి బొటనవేలికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మరోసారి గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నైలో బుధవారం జరగనున్న మ్యాచ్ కు విలియమ్సన్ కు విశ్రాంతి ఇచ్చారు. అంతకు ముందు ఐపీఎల్ లో మోకాలి గాయం కారణంగా కొన్ని నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. జట్టులోకి వచ్చాడని అభిమానులు సంతోషించేలోపే విలియమ్సన్ గాయపడ్డాడు. టోర్నీలో మళ్లీ ఎప్పుడు జట్టులోకి వస్తాడన్నదానిపై స్పష్టత లేదు.
పిచ్ ఎలా ఉంటుంది?
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అదే సమయంలో ఆరంభంలో పేసర్లకు మంచి సీమ్ దొరుకుతుంది. మ్యాచ్ చివరికల్లా స్వింగ్, రివర్స్ స్వింగ్ బౌలర్లు మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఈ వేదికలో స్లో డెలివరీలతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో చెపాక్ లోనే ఆడటం కివీస్ కు కలిసొచ్చే అంశం.
వెదర్ రిపోర్ట్..
చెన్నైలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉంటుంది. క్రమంగా సాయంత్రం, రాత్రి తేమ పెరుగుతుంది. టాస్ నెగ్గిన టీమ్ బౌలింగ్ తీసుకుని ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసే ఛాన్స్ ఉంది.
అఫ్గాన్, కివీస్ మ్యాచ్ లో జట్ల అంచనా..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, డీజే మిచెల్, రచిన్ రవీంద్ర, ఎంఎస్ చాప్ మన్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, ఫెర్గూసన్, ఎంజే హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి.
ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, ఆర్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్ జాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఐఏ ఖిల్, రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్ -ఉల్-హక్.